ఎన్నికల నిర్వాహణ ఏర్పాట్లలో అధికారులకు క్షణం తీరిక దొరకడం లేదు..!

13 Oct, 2023 07:04 IST|Sakshi
నోడల్ అధికారుల సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ వెంకట్రావు, చిత్రంలో అదనపు కలెక్టర్లు

ఎన్నికల ఏర్పాట్లలో జిల్లా అధికారులు తలమునకలు

రోజూ ప్రత్యేక సమావేశాలు.. సమీక్షలు

ఏర్పాట్లు పరిశీలిస్తూ .. కోడ్‌ను అమలు చేస్తూ..

ఎన్నికల విధుల్లో 12 వేల మందికి పైగా ఉద్యోగులు

సూర్యాపేట: అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు తలమునకలయ్యారు. కలెక్టరేట్‌లోని దాదాపు అన్ని శాఖల జిల్లా అధికారులకు, సిబ్బందికి ఎన్నికల విధులు కేటాయించారు. రోజూ కలెక్టరేట్‌లో ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చలు జరపడం, సమావేశాలు నిర్వహిస్తూ బిజీగా మారారు. కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు ఎన్నికలకు సంబంధించి సమీక్షలు, సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు.

ఎన్నికల పర్యవేక్షణకు కమిటీలు..
జిల్లాలో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు 17 కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలకు జిల్లా అధికారులను నోడల్‌ అధికారులుగా విధులు కేటాయించారు. ఇందులో మోడల్‌ కోడ్‌ అమలు, ఈవీఎం, వీవీ ప్యాట్ల పర్యవేక్షణ, ఉద్యోగులకు విధుల కేటాయింపు, అభ్యర్థి తరఫున ఏజెంట్లకు లైసెన్స్‌ ఇవ్వడానికి, పోలింగ్‌ కేంద్రాల వద్ద మౌలిక వసతుల కల్పన, ఎన్నికల సిబ్బందికి శిక్షణ, ఓటరు నమోదుపై అవగాహన, ఎన్నికల వ్యయ నిర్ధారణ, మీడియా కమ్యూనికేషన్‌, పోస్టల్‌ బ్యాలెట్‌– ఈవీఎం బ్యాలెట్‌ కమిటీ, ఇన్ఫర్మేషన్‌ అండ్‌ టెక్నాలజీ, గెస్ట్‌ హౌస్‌ల ఏర్పాటు, మైక్రో అబ్జర్వర్‌, హెల్ప్‌లైన్‌ అండ్‌ కంట్రోల్‌ యూనిట్‌, ఎంసీఎంసీఏ, పోలీస్‌ కోఆర్డినేషన్‌, హెలిపాడ్‌ కోఆర్డినేషన్‌ వంటి వాటికి వివిధ శాఖల అధికారులతో కమిటీలను ఏర్పాటు చేశారు.

ఇటు శాఖా పరమైన విధులు.. అటు ఎన్నికల పనులు
కలెక్టరేట్‌లో ఎన్నికల విభాగం ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎన్నికల అధికారికి సహాయకులుగా మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. వీరిలో ఎన్నికల సూపరింటెండెంట్‌, డిప్యూటీ తహసీల్దార్‌, ఇద్దరు జూనియర్‌ అసిస్టెంట్లు కాగా మరో నలుగురు కంప్యూటర్‌ ఆపరేటర్లు ఉన్నారు. వీరంతా నెల రోజులుగా ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

వీరే కాకుండా ఆయా శాఖల అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో బిజీగా మారారు. జిల్లా స్థాయి అధికారులైతే ఇటు తమ శాఖకు సంబంధించిన పనులు చేస్తూ అటు ఎన్నికల ఏర్పాట్లపై తమకు కేటాయించిన మండలాలు, గ్రామాలకు వెళ్లి క్షేత్ర పర్యటన చేస్తున్నారు. అక్కడ పోలింగ్‌ కేంద్రాల్లో ఉన్న సదుపాయాలు, ఇంకా కావాల్సిన అవసరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.

రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు
జిల్లాలో నాలుగు నియోజకవర్గాలకు రిటర్నింగ్‌ అధికారులను ఇప్పటికే కేటాయించారు. తుంగతుర్తి నియోజకవర్గానికి జిల్లా అదనపు కలెక్టర్‌ వెంకట్‌రెడ్డి, హుజూర్‌నగర్‌ నియోజకవర్గానికి జగదీశ్వర్‌రెడ్డి, సూర్యాపేట నియోజకవర్గానికి సూర్యాపేట ఆర్‌డీఓ వీరబ్రహ్మచారి, కోదాడ నియోజకవర్గానికి కోదాడ ఆర్‌డీఓ సూర్యానారాయణలను రిటర్నింగ్‌ అధికారులుగా నియమించారు.

అదే విధంగా నియోజకవర్గాల పరిధిలోని తహసీల్దార్లు అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులుగా వ్యవహరించనున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్‌ దగ్గర నుంచి పోలింగ్‌, కౌంటింగ్‌ వరకు అన్ని బాధ్యతలను వీరు నిర్వర్తించనున్నారు. అదే విధంగా అభ్యర్థుల వ్యయ నిర్ధారణ, ఫిర్యాదులు, చర్యలు వంటివి రిటర్నింగ్‌ అధికారులు చూసుకుంటారు.

పోలింగ్‌ నిర్వహణకు సుమారు 12 వేల మంది
పోలింగ్‌ నిర్వహణకు సిబ్బందిని కేటాయించే పనిలో జిల్లా అధికారులు ఉన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు, ఇతర శాఖల ఉద్యోగులను పోలింగ్‌ నిర్వహణకు వినియోగించుకోనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సరిపడక పోతే ప్రైవేట్‌ ఉపాధ్యాయులను విధులకు వాడనున్నారు.

జిల్లాలో 1,201 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా ప్రతి పోలింగ్‌ కేంద్రానికి ఒక పోలింగ్‌ ఆఫీసర్‌, ఒక అసిస్టెంట్‌ పోలింగ్‌ అధికారి, ఇద్దరు, లేదా ముగ్గురు పోలింగ్‌ సిబ్బందిని కేటాయించనున్నారు. దీని ప్రకారం 1,201 మంది పోలింగ్‌ అధికారులు, 1,201 మంది అసిస్టెంట్‌ పోలింగ్‌ అధికారులు , ఇద్దరు సిబ్బందిని వాడితే 2,402 మంది, లేదా ముగ్గురిని కేటాయిస్తే 3,603 మంది ఎన్నికల సిబ్బందికి విధులు కేటాయించనున్నారు.

మరిన్ని వార్తలు