భర్తతో విడిపోయిన మీనా.. రెండో వివాహం చేసుకున్న తర్వాత..

8 May, 2022 09:07 IST|Sakshi

తిరువొత్తియూరు: తూత్తుకుడి జిల్లాలో రెండో వివాహం చేసుకున్న మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ ఘటనపై ఆమె తల్లి, అన్నతో సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న తండ్రి కోసం గాలిస్తున్నారు. 

వివరాల్లోకి వెళితే.. తూత్తుకుడి జిల్లా, సెయ్యంగనల్లూర్‌ సమీపంలోని కరుంగుళం, తాత్తాన్‌కుళంకు చెందిన సిడలై ముత్తు కుమార్తె మీనా (21). ఈమెకు ఐదేళ్ల క్రితం తాత్తాన్‌కుళం సమీపంలోని కాల్వాయ్‌ గ్రామానికి చెందిన ఇసక్కి పాండియన్‌తో వివాహమైంది. వీరికి కుమారుడు నిశాంత్‌ (04) ఉన్నాడు. ఈ క్రమంలో భర్త నుంచి విడిపోయిన మీనా నెల్లై జిల్లా పడపిల్లై పుదూర్‌కు చెందిన మరో వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. అతనితో 10 నెలలుగా కాపురం చేస్తున్నట్లు సమాచారం. నిశాంత్‌ తండ్రి వద్ద ఉన్నాడు. 

కాగా, కుమార్తె రెండవ వివాహం చేసుకోవడం అవమానంగా భావించిన సుడలైముత్తు కుటుంబం మీనాపై తీవ్ర కోపంతో ఉన్నారు. ఈ స్థితిలో శుక్రవారం తాత్తాన్‌కుళంలో జరిగిన ఆలయ ఉత్సవాలకు మీనా తన పిన్ని పార్వతి ఇంటికి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న సడలై ముత్తు, అతని భార్య ముప్పిదాతి, కుమారుడు మాయండి, సడలై ముత్తు అన్న తలవాయ్, అతని భార్య వీరమ్మాళ్, వీరి కుమారుడు మురుగన్‌ మీనాతో గొడవపడ్డారు. ఆ సమయంలో ఆగ్రహం చెందిన సడలై ముత్తు తన వద్ద ఉన్న కత్తితో మీనా పైదాడి చేశాడు. 

దీంతో మీనా ఘట నా స్థలంలోనే దుర్మరణం చెందింది. సెంగనల్లూర్‌ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసు కుని శవ పరీక్ష కోసం నెల్లై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసుల విచారణలో మొదటి భర్తకు విడాకులు ఇవ్వకుండా మరో వ్యక్తిని వివాహం చేసుకోవడంతో కుమార్తెను హత్య చేసినట్లు తెలిసింది.  

మరిన్ని వార్తలు