TS: ఇంజనీరింగ్‌ కాలేజీల సీట్ల దందాపై ఉన్నత విద్యామండలి దృష్టి

5 Jul, 2023 08:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల సీట్ల దందాకు చెక్‌ పెట్టేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తు మొదలుపెట్టింది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న టాపర్స్‌ జాబితాపై దృష్టి పెట్టనుంది. జేఈఈ ద్వారా జాతీయ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సీట్లు పొంది, జోసా కౌన్సెలింగ్‌ ద్వారా వాటిల్లో చేరిన వారి వివరాలు సేకరించాలని యోచిస్తోంది.

ఇదే విద్యార్థులు రాష్ట్ర ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ద్వారా సీట్లు పొంది, చివరలో రద్దు చేసుకోవడం వెనుక కథేంటో తేల్చాలని నిర్ణయించింది. ప్రైవేటు కాలేజీలతో కుమ్మక్కయినట్లు బయటపడితే కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. దీనిపై ఇప్పటికే ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన మండలి త్వరలో ఇందుకు సంబంధించిన విధివిధానాలకు రూపకల్పన చేయనుంది.

ర్యాంకర్లకు కాలేజీల వల్ల జేఈఈ, ఎంసెట్‌లో టాప్‌ ర్యాంకులు సాధించిన రాష్ట్ర విద్యా ర్థులు అటు ఎన్‌ఐటీ, ఐఐటీ, ట్రిపుల్‌ ఐటీ, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజనీరింగ్‌ కాలేజీల్లో జరిగే కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్నారు. ముందుగా రాష్ట్ర ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ మొదలవుతుంది. దీంతో డిమాండ్‌ ఎక్కువగా ఉన్న కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్, సైబర్‌ సెక్యూరిటీ, ఏఐఎంఎల్, డేటాసైన్స్‌ వంటి కోర్సుల్లో తొలి విడత కౌన్సెలింగ్‌లోనే సీట్లు పొందుతున్నారు. సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ కూడా చేస్తున్నారు.

ఆ తర్వాత వీరికి జోసా కౌన్సెలింగ్‌లోనూ సీట్లు వస్తున్నాయి. వాటిల్లోనూ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేస్తున్నారు. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ద్వారా పొందిన సీటును రద్దు చేసుకోకుండా ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ అన్ని దశలు అయిపోయే వరకు అలాగే ఉంచి చివర్లో రద్దు చేసుకుంటున్నారు. ఈ సీట్లను ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు స్పాట్‌ అడ్మిషన్‌ ద్వారా భర్తీ చేస్తున్నాయి. ఈ క్రమంలో ముందే ఎక్కువ డబ్బులకు మాట్లాడుకున్న వారికి కాలేజీలు సీట్లు కేటాయిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో టాప్‌ ర్యాంకర్లకు కూడా ముందే వల వేసి ఒప్పందం చేసుకుంటున్నారని, ఈ మేరకు కొంత మొత్తం ముట్టజెబు తున్నారని విద్యార్థి, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ఈ వ్యవహారంలో రూ.కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయని, ఉన్నతాధికారులకు సైతం ఇందులో వాటాలు ఉంటున్నాయని ఆరోపిస్తున్నాయి. ప్రైవేటు కాలేజీల దందాపై ప్రతి ఏటా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ఇంటెలిజెన్స్‌ వర్గాలు కూడా ఈ తంతుపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా నివేదికలు ఇస్తున్నాయి. దీంతో ఈ అడ్డగోలు వ్యాపారానికి చెక్‌ పెట్టాలనే నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం.. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. 

ఏం చేయబోతున్నారు..?
తొలిదశలోనే సీటు సాధించి చివరి కౌన్సెలింగ్‌ వరకూ రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో చేరని వారి వివరాలు సేకరిస్తారు. జాతీయ సంస్థలతో సమన్వయం చేసుకుని, జోసా కౌన్సెలింగ్‌లో వారికి సీటు ఎప్పుడొచ్చింది? ఎప్పుడు రిపోర్టు చేశారు? అనే వివరాలు సేకరిస్తారు. ఇదంతా విద్యార్థుల ఆధార్‌ నంబర్‌ ఆధారంగా చేయాలని భావిస్తు న్నారు. విద్యార్థులకు ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల ద్వారా లబ్ధి చేకూరిందా అనేది నిగ్గు తేల్చేందుకు వారి బ్యాంకు ఖాతాలతో పాటు తల్లిదండ్రులు, బంధువుల బ్యాంకు ఖాతాలను కూడా చెక్‌ చేసే వీలుందని ఓ అధికారి తెలిపారు.

ప్రాథమిక ఆధారాలు లభిస్తే తక్షణమే జాతీయ సంస్థలతో మాట్లాడి ఆ విద్యార్థి ఎక్కడ సీటు పొందినా బ్లాక్‌ చేయాలనే ఆలోచనలో అధికారులున్నారు. ఈ క్రమంలో కాలేజీలు, విద్యార్థులపై కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడ బోమని అధికారులు అంటున్నారు. కాలేజీల సీట్ల వ్యాపారంలో పావులు కావొద్దంటూ విద్యార్థులను హెచ్చరించేలా ప్రచారం సైతం చేసేందుకు మండలి సిద్ధమవుతోంది. 

మరిన్ని వార్తలు