-

రూపాయి బిర్యానీ కోసం వెళ్తే రూ.235 జరిమానా 

17 Jun, 2023 03:52 IST|Sakshi

కరీంనగర్‌లో రూపాయి నోటుకు బిర్యానీ అంటూ ఆఫర్‌ ఇచ్చిన ఓ హోటల్‌

ఎగబడ్డ జనం..అరగంటలో అంతాఖాళీ 

రోడ్డుపై ట్రాఫిక్‌ జామ్‌

హోటల్‌ ముందు నిలిపిన వాహనాలకు పోలీసుల ఫైన్లు

కరీంనగర్‌క్రైం: రూపాయి నోటుకు బిర్యానీ వస్తుందని ఆశపడి వెళ్లిన వారికి రూ.100 నుంచి రూ.235 వరకు జరిమానా పడింది. కరీంనగర్‌లోని తెలంగాణచౌక్‌ సమీపంలో కొత్తగా ప్రారంభించిన ఒక బిర్యానీసెంటర్‌ నిర్వాహకులు శుక్రవారం రూపాయి నోటు ఇచ్చిన వారికి బి ర్యానీ ఇస్తామని ప్రచారం చేశారు.

ఇందుకోసం ప్రత్యేకంగా సమయాన్ని కూడా సూచించారు. ఈ విషయం సోషల్‌ మీడియాలో కూడా  వైరల్‌ కావడంతో జనం రూపాయి నోటుకు బిర్యానీ కోసం ఎగబడ్డారు. అరగంటలో 800లకు పైగా బి ర్యానీ ప్యాకెట్లను కొనుగోలు చేసేశారు. చాలామందికి బిర్యానీ లభించకపోవడంతో హోటల్‌ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో భారీ ఎత్తున ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.

ట్రాఫిక్‌ పోలీసులు వచ్చి బిర్యానీసెంటర్‌ను మూసివేయించడంతోపాటు రోడ్లమీద అడ్డదిడ్డంగా పార్కింగ్‌ చేసిన వందమంది వాహనాలకు రూ.100 నుంచి రూ.235వరకు జరిమానా విధించారు. దీంతో కొందరు బిర్యానీ సెంటర్‌ నిర్వాహకుడిపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు