RBI: యాక్సిస్ బ్యాంక్‌కు రూ.91 లక్షల జరిమానా - ఎందుకో తెలుసా!

17 Nov, 2023 16:23 IST|Sakshi

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గత కొంతకాలంగా నిబంధనలను అతిక్రమించే బ్యాంకుల లైసెన్సులు రద్దు చేస్తూ, మరి కొన్ని బ్యాంకులకు భారీ జరిమానాలు విధిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఇటీవల యాక్సిస్ బ్యాంక్‌, గోల్డ్ లోన్ అందించే మణప్పురం ఫైనాన్స్‌, ఫైనాన్స్ రంగానికి చెందిన ఆనంద్ రాఠి గ్లోబల్ ఫైనాన్స్ కంపెనీలకు భారీ జరిమానాలు విధించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నియమాలను అతిక్రమించిన కారణంగా యాక్సిస్ బ్యాంక్‌కు ఆర్‌బీఐ రూ. 90.92 లక్షలు, మణప్పురం ఫైనాన్స్‌కు రూ. 42.78 లక్షలు, ఆనంద్ రాఠి గ్లోబల్ ఫైనాన్స్‌కు రూ. 20 లక్షల జరిమానా విధించింది.

కేవైసీ మార్గదర్శకాలను పాటించకపోవడం వల్ల యాక్సిస్ బ్యాంక్‌కు జరిమానా విధించినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. అంతే కాకుండా బ్యాంకింగ్ సర్వీస్ అవుట్‌సోర్సింగ్, కరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేయడం, మేనేజ్ చేయడం వంటి ఇతర నియమాలను కూడా పాటించలేదని స్పష్టం చేసింది.

నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు సంబంధించిన 'సిస్టమాటిక్ ఇంపోర్ట్ నాన్-డిపాజిట్ టేకింగ్ కంపెనీ అండ్ డిపాజిట్ టేకింగ్ కంపెనీ గైడ్‌లైన్స్ - 2016'ను సరిగ్గా పాటించనందుకు త్రిసూర్‌కు చెందిన మణప్పురం ఫైనాన్స్‌పై రూ.42.78 లక్షల జరిమానా విధించినట్లు సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది.

నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ అయిన ఆనంద్ రాఠి గ్లోబల్ ఫైనాన్స్ లిమిటెడ్‌ కూడా 'నో యువర్ కస్టమర్' (KYC) నిబంధనలను పాటించనందుకు ఆనంద్ రాఠి గ్లోబల్ ఫైనాన్స్ లిమిటెడ్‌కు కూడా రూ. 20 లక్షల జరిమానా విధించారు.

మరిన్ని వార్తలు