దసరా పండుగ స్పెషల్‌.. హైదరాబాద్‌ నుంచి ఏపీకి వెయ్యి ప్రత్యేక బస్సులు 

12 Oct, 2023 04:53 IST|Sakshi

హైదరాబాద్‌ నుంచి ఏపీకి వెయ్యి ప్రత్యేక బస్సులు 

సాధారణ చార్జీలకే నడపనున్న ఏపీఎస్‌ ఆర్టీసీ

సాక్షి, హైదరాబాద్‌: దసరా పండుగ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీ హైదరాబాద్‌ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెయ్యి ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లో ఉంటున్న ఏపీ వాసులను దృష్టిలో ఉంచుకుని సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ లోని వివిధ ప్రాంతాలకు రోజువారీగా తిరుగుతున్న 355 బస్సులకు ఇవి అదనంగా తిరుగుతాయి. ఈనెల 18 నుంచి 23 వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. గతంలో పండుగ ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీ వసూలు చేసే పద్ధతి ఉండేది.

కానీ, ఈసారి ఎలాంటి ప్రత్యేక చార్జీలు లేకుండా సాధారణ టికెట్‌ ధరలే వసూలు చేయాలని నిర్ణయించారు. దసరా పండుగకు నగరం నుంచి ఏపీలోని సొంతూళ్లకు ప్రజలు భారీ ఎత్తున వెళ్తారు. ఈపాటికే అన్ని రైళ్లలో రిజర్వేషన్లు పూర్తయి, పెద్ద ఎత్తున వెయిటింగ్‌ జాబి తా కనిపిస్తోంది. ప్రత్యేక రైళ్లు కూడా నిండిపోయాయి. దీంతో చాలామంది బస్సులపైనే ఆ ధారపడతారు. తెలంగాణ నడిపే బస్సులు కూడా చాలక ప్రైవేటు వాహనాల్లో వెళ్లేవారు అధిక సంఖ్యలో ఉంటారు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక బస్సులు నడపా లని ఏపీఎస్‌ ఆర్టీసీ నిర్ణయించింది. బీహెచ్‌ఈఎల్, మియాపూర్, ఈసీఐఎల్, ఎంజీబీఎస్‌ల నుంచి ఇవి బయలుదేరతాయి. ఎంజీబీఎస్‌ లో రద్దీని నివారించేందుకు ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, మాచెర్ల తదితర ప్రాంతాలకు వెళ్లే సాధారణ, ప్రత్యేక బస్సులను ఎంజీబీఎస్‌ ఎదురుగా ఉన్న పాత సీబీఎస్‌ ప్రాంగణం నుంచి నడుపుతారని ఏపీఎస్‌ ఆర్టీసీ అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు