మొక్కలకు కేరాఫ్‌ కులబ్‌గూర్‌

15 Jul, 2021 08:23 IST|Sakshi

ఎకరం విస్తీర్ణంలో 5 వేల మొక్కల పెంపకం 

40 రకాల పండ్ల చెట్లు.. 30 రకాల ఔషధ మొక్కలు

సంగారెడ్డి రూరల్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పల్లెప్రకృతి వనాలు ఆయా గ్రామాల్లో సత్ఫలితాలను ఇస్తున్నాయి. సంగారెడ్డి మండలం కులబ్‌గూర్‌ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఎకరా విస్తీర్ణంలో గతేడాది ఆగస్టులో ప్రారంభించిన పల్లె ప్రకృతి వనంలో భాగంగా 5 వేలు నాటగా,  ఇప్పుడవి ఫలాలను అందించే వనంగా తయారయ్యాయి. 40 రకాల పండ్ల మొక్కలతో పాటు, పూల మొక్కలు, 30 రకాల ఔషధ గుణాలు గల మొక్కలను పెంచుతున్నారు. ఆదర్శంగా ఉన్న ఈ ప్రకృతి వనాన్ని జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సందర్శిస్తున్నారు. 

వనంలో అరుదైన మొక్కలు 
చాలా వరకు కనుమరుగైన మొక్కలు ఈ వనంలో పెంచుతున్నారు. సీమరూబ, ఆకాశమల్లె, రామఫల్, లక్ష్మణఫల్, చెన్నంగి, అశ్వగంధ, సంపెంగ, నూరు వరహాలు, నంది వర్ధనం, గచ్చకాయ, పసరుగణి, దేవగన్నేరు, సీమచింత, సీమరుబ్బ, సింగపూర్‌ చెర్రి, తుబూలియా హాలండియా, నెమలినార, గంగరావి, బుడ్డ ధరణి, లెమన్‌గ్రాస్‌.. ఇలాంటి అరుదైన రకాల మొక్కలను పెంచుతున్నారు. ప్రభుత్వ అధికారుల తోడ్పాటుతో వనం పచ్చదనంతో సుందరవనంగా చూపరులను ఆకట్టుకుంటుంది. 

పల్లె ప్రకృతి వనంలో గ్రామం ప్రత్యేకం 
పల్లెవనంలో పెంచుతున్న మొక్కలను స్వయంగా వివిధ నర్సరీలలో కొనుగోలు చేసి వాటిని ఈ వనంలో పెంచుతున్నాం. ప్రత్యేకంగా 116 వెరైటీ మొక్కలు పెంచడంతో ఆదర్శంగా నిలుస్తున్నాం. గ్రామస్తుల సహాయ సహకారాలతో ముందుకు వెళ్తున్నాం. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సందర్శించి కనుమరుగైన మొక్కల గురించి తెలుసుకుంటున్నారు. ఈ వనంతో గుర్తింపు రావడంతో గర్వంగా ఉంది. 
– సాదీజాబేగం, కులబ్‌గూర్‌ సర్పంచ్‌ 

ఔషధ గుణాల మొక్కలతో ఉపయోగం 
ప్రస్తుత కాలంలో ఔషధ గుణాల మొక్కలతో ఉపయోగం ఉంటుంది. స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. పార్కుల్లో ఇలాంటి మొక్కలు పెట్టడంతో ఆహ్లాద వాతావరణంతో పాటు ఆక్సిజన్‌ లభిస్తుంది. రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. కనుమరుగైన మొక్కలను భావితరాలకు తెలియజేయడానికి మావంతు కృషి చేశాం. రాగి, మర్రి, తులసి ఇతర మొక్కల ద్వారా ప్రజలకు ఆరోగ్యపరంగా మేలు జరుగుతుంది. 
– మహేందర్‌రెడ్డి, ఎంపీఓ  

మరిన్ని వార్తలు