రైతుబంధు వచ్చేదెప్పుడో? లక్షన్నర మంది రైతుల నిరీక్షణ 

28 Jan, 2023 01:32 IST|Sakshi

కొత్తగా పాస్‌పుస్తకాలు పొందిన రైతులకు అందని పెట్టుబడి సాయం 

దరఖాస్తు చేసుకున్నా ఆన్‌లైన్‌లో నమోదు కాకపోవడమే కారణం 

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో గతేడాది జూలై నుంచి ఇప్పటివరకు కొత్తగా పట్టాదారు పాస్‌పుస్తకాలు పొంది రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకున్న దాదాపు లక్షన్నర మంది రైతులందరిదీ ఇదే బాధ. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు కాకపోవడమే ఇందుకు కారణం.

ప్రభుత్వం ఈ యాసంగి సీజన్‌లో పెట్టుబడి సాయం అందించే క్రమంలో రైతుబంధు పథకానికి 2022 డిసెంబర్‌ 20 నాటికి కొత్తగా పాస్‌ పుస్తకాలు లభించిన వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది. జిల్లాల్లో వ్యవసాయ అధికారులు కూడా స్థానికంగా ప్రకటనలు జారీ చేశారు. జనవరి 7 వరకు గడువు ఇచ్చారు. దీంతో హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్‌ మల్కాజిగిరి, కామారెడ్డి మినహా మిగతా 28 జిల్లాల్లో 1,40,668 మంది రైతులు రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకొని ఎదురుచూస్తున్నారు. 

నిలిచిన లాగిన్‌ సౌకర్యం.. 
గత వానాకాలం సీజన్‌లో జూన్‌ 28 నుంచి పెట్టుబడి సాయం అందించారు. జూన్‌ 20 వరకు పాస్‌పుస్తకాలు కలిగిన లేదా రిజిస్ట్రేషన్లు అయిన రైతుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసి ప్రభుత్వం సాయం అందించింది. జూలై 20 తరువాత కొనుగోలు చేసిన లేదా వారసత్వం కింద రిజిస్ట్రేషన్లు చేయించుకున్న వారికి యాసంగి పెట్టుబడి కోసం రైతుబంధుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

మరోవైపు ధరణి సమస్యలతో నిషేధిత జాబితాలో పడిన భూముల సమస్యలకు ఇటీవల పరిష్కారం లభించింది. అలాంటి వారికి పాస్‌ పుస్తకాలు వచ్చాయి. వారంతా మండల స్థాయిలో రైతుబంధుకు దరఖాస్తు చేసుకున్నారు. వారి వివరాలను ఏవో, ఏఈవోలు రైతుబంధు పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంది. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ పోర్టల్‌లో అధికారులకు ప్రభుత్వం లాగిన్‌ అవకాశం ఇవ్వలేదు. దీంతో దరఖాస్తుదారుల వివరాలను వారు ఆన్‌లైన్‌లో నమోదు చేయలేదు. ఫలితంగా ఆయా రైతులకు యాసంగి పెట్టుబడి సాయం అందలేదని అధికారులు చెబుతున్నారు. 

వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన ఈమె పేరు కాలం రజిత. ఇటీవలే 2.16 ఎకరాలకు పాసు పుస్తకం వచ్చింది. నవంబర్‌ 16నే రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ రాలేదు. దీంతో పెట్టుబడి కోసం ఎకరానికి రూ. 20 వేలు అప్పు చేయాల్సి వచ్చింది. 
 
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గోపాలరావుపల్లెకు చెందిన ఈయన కడారి శ్రీనివాస్‌రెడ్డి. అదే మండలంలోని వెంకటాపూర్‌ శివారులో 6 నెలల కిందట 3 ఎకరాల భూమి కొన్నారు. పాస్‌ బుక్‌ వచ్చింది. రైతుబంధుకు దరఖాస్తు చేసుకున్నా రాలేదు. 

ఈమె నల్లగొండ జిల్లా పెద్ద వూర మండలం చింతపల్లికి చెందిన కట్టెబోయిన విష్ణుప్రియ. తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చి న ఆరెకరాల భూమికి ఆగస్టులో పాసుపుస్తకం వచ్చింది. యాసంగి రైతుబంధు సహా యం కోసం ప్రభుత్వం అవకాశం ఇవ్వడంతో దరఖాస్తు చేసుకుంది. అయినా రైతుబంధు మంజూరు కాలేదు. దీంతో పెట్టుబడి కోసం అప్పు చేయాల్సి వచ్చింది. 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు