ఆవేశపడితే అరదండాలే!

19 Aug, 2020 05:20 IST|Sakshi

సోషల్‌ మీడియాపై 24 గంటలూ పోలీసుల నిఘా 

విదేశాలకు వెళ్లినా వదలరు.. ద్వేషంతో పోస్టులు పెడితే అరెస్టే 

పాస్‌పోర్టులు రద్దవుతాయ్‌..జాగ్రత్త! 

ముఖ్యమంత్రిని కించపరిచేలా పోస్టు పెట్టిన ఓ పార్టీ సానుభూతిపరుడిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఓ మతాన్ని అవమానించేలా పోస్టు పెట్టిన ఓ నటుడిని సైతం పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. 

సాక్షి, హైదరాబాద్‌: సోషల్‌ మీడియాలో కొందరు పరిధి దాటి చేస్తున్న కామెంట్లు వారిని జైలు పాలు చేస్తున్నాయి. సమాజంలోని కొన్ని వర్గాలను, కీలక వ్యక్తులను, మతాలను కించపరిచేలా పోస్టులు పెడితే వెంటనే పోలీసులు రంగంలోకి దిగుతున్నారు. బెంగళూరులో ఓ వ్యక్తి పెట్టిన పోస్టు అల్లర్లకు దారి తీసి పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మరణించడం తెలిసిందే. దీంతో తెలంగాణలోనూ పోలీసులు సోషల్‌ మీడియాపై నిఘా పెంచారు. 24 గంటలూ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో నిఘా ఉండేలా చేశారు. ఎవరు వివాదాస్పద కామెంట్లు చేసినా, పుకార్లు, వదంతులు పుట్టించినా.. వెంటనే సైబర్‌ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగుతారు. 

సోషల్‌ మీడియా పోస్టులు చేసే వారు ఎక్కడున్నా పోలీసులు వదలరు. కొందరు మిడిమిడి జ్ఞానంతో తాము పక్క రాష్ట్రంలో ఉన్నామని లేదా విదేశాల్లో ఉన్నామని ఇది తెలంగాణ పోలీసుల పరిధి కాదన్న భ్రమలో ఇష్టానుసారంగా ప్రభుత్వంలోని కీలక వ్యక్తులను, ఉన్నత స్థాయి అధికారులను కించపరుస్తూ పోస్టులు పెడుతున్నారు. వీటిని తీవ్రంగా పరిగణిస్తున్న పోలీసులు రాష్ట్రంలోకి రాగానే వెంటనే అరెస్టు చేస్తున్నారు. ఒక్కసారి కేసు నమోదయ్యాక వారి పాస్‌పోర్టు సహా అన్ని వివరాలు పోలీసుల వద్ద ఉంటాయి.

కరోనాతో తెలంగాణ ముఖ్యమంత్రి మరణించారంటూ జగిత్యాలకు చెందిన ఓ యువకుడు దుబాయ్‌ నుంచి ఫేస్‌బుక్‌లో ఇటీవల పోస్టు చేశాడు. సోమవారం రాత్రి శంషాబాద్‌ విమానాశ్రయంలో సదరు యువకుడు దిగగానే పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పిచ్చికామెంట్లు చేసి విదేశాలకు పారిపోదామన్నా ఇక కుదరదు. ఐటీ యాక్టు ప్రకారం.. పాస్‌పోర్టు రద్దు చేసి, లుకవుట్‌ నోటీసులు జారీ చేసే అవకాశం కూడా ఉంది. సోషల్‌ మీడియాలో కోపం, ద్వేషంతో పోస్టులు పెట్టేవారూ.. తస్మాత్‌ జాగ్రత్త.  

మరిన్ని వార్తలు