ఏపీ రాజకీయాలపై తెలంగాణ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్‌ ఎంత?

2 Dec, 2023 10:54 IST|Sakshi

తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీ రాజకీయాలపై ఎంతవరకు ఉంటుందన్న చర్చ జరుగుతోంది. ప్రత్యేకించి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సంబంధ, బాంధవ్యాలు, రాజకీయ అనుబంధాల నేపథ్యంలో దీనికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. నిజానికి తెలంగాణలో ఎలాంటి ఫలితం వచ్చినా ఏపీ రాజకీయాలపై పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఏపీ రాజకీయ పరిస్థితులకు తెలంగాణ రాజకీయాలు భిన్నంగా ఉన్నాయి. తెలంగాణలో  బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ప్రధాన ప్రత్యర్ధులుగా ఉన్నాయి. ఏపీలో అందుకు భిన్నమైన వాతావరణం ఉంది. ఏపీలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు ఒక్క శాతం లోపే ఓట్లు ఉన్నాయని ఎన్నికల గణాంకాలు చెబుతున్నాయి.

✍️వైఎస్సార్‌ కాంగ్రెస్ తెలంగాణ రాజకీయాలలో జోక్యం చేసుకోవడం లేదు. ఎవరైనా ఆ పార్టీ నేతలు ఒకరిద్దరు అక్కడ ఏదైనా చేస్తున్నా అది వారి వ్యక్తిగతం అని చెప్పాలి. బీఆర్ ఎస్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా పోటీ చేస్తుంటే, సీపీఐతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. తెలుగుదేశం పార్టీ అనధికారికంగా కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తోంది. ఆ పార్టీకి సంబంధించి కొందరు కాంగ్రెస్ ర్యాలీలలో టీడీపీ జెండాలతో తిరుగుతున్నారు. అయినా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కడా ఖండించలేదు. తమ మద్దతు ఎవరికి లేదని చెప్పలేదు. దాంతో కాంగ్రెస్‌కు ఆయన అనుకూలంగా ఉన్నారన్న సంకేతాలు వెళ్లాయి.

✍️తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తన పదవికి రాజీనామా చేస్తూ కాంగ్రెస్‌కు ఉపయోగపడాలని, అందుకే టీడీపీ శాసనసభ ఎన్నికలలో  పోటీ చేయడం లేదని చంద్రబాబు  చెప్పారని వెల్లడించారు. ఇక ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న పార్టీగా ఉన్న జనసేన మాత్రం తెలంగాణలో  బీజేపీతో కలిసి ఎనిమిది చోట్ల పోటీ చేస్తోంది. బీజేపీ సభలలో పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగాలు చేశారు. బీజేపీతో పొత్తులో ఉంటూనే, హైదరాబాద్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో చంద్రబాబు నాయుడుతో భేటీ అవడం విశేషం. అయినా చంద్రబాబును తెలంగాణలో జనసేనకు మద్దతు ఇవ్వాలని కోరలేదు. చంద్రబాబు కూడా జనసేనను బలపరచండని టీడీపీ అభిమానులకు పిలుపు ఇవ్వలేదు. ఆ రకంగా సొంత పార్టీ అభ్యర్ధులకు  పవన్ కళ్యాణ్‌ వెన్నుపోటు పొడిచారన్న అభిప్రాయం వస్తుంది.

✍️బీజేపీతో జనసేన తెలంగాణలో కలిసి ఏపీలో మాత్రం ఆ పార్టీతో  కాపురం చేయకుండా టీడీపీతో సహజీవనం చేయడం రాజకీయాలలో వింతగా మారింది. దీనిని వావివరసలు లేని రాజకీయంగా వైసీపీ నేత పేర్ని నాని ఇప్పటికే విమర్శించారు. ఈ విధంగా చూస్తే తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం టీడీపీ, జనసేనలపైనే ఎక్కువగా ఉంటుంది. టీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తే టీడీపీ, జనసేనలకు షాక్ అవుతుంది. వారు కోరుకున్నట్లు కాంగ్రెస్ కాని, బీజేపీ కాని గెలవకపోతే వారికి నిరుత్సాహం అవుతుంది. చంద్రబాబు అరెస్టును బీఆర్ఎస్‌కు చెందిన కొందరు నేతలు కూడా ఖండించినా, టీడీపీ శ్రేణులు కాని, టీడీపీని ఓన్ చేసే ఒక సామాజికవర్గం వారు కాని కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారన్న భావన ఉంది.

✍️బీఆర్ఎస్ గెలిస్తే ఏపీలో ఆటోమాటిక్‌గా వైసిపికి అడ్వాంటేజ్‌గా ఉండవచ్చన్నది వారి భయం అని చెబుతున్నారు. టీడీపీకి మద్దతు ఇచ్చే సామాజికవర్గం ఇలా వ్యవహరిస్తుండేసరికి కొందరు టీఆర్ఎస్ అభ్యర్ధులు ప్రత్యేకించి హైదరాబాద్ నగరంలో వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానుల పేరుతో సమావేశాలు నిర్వహించి వారి మద్దతు అభ్యర్ధించడం విశేషం. టీఆర్ఎస్ గెలిస్తే సహజంగానే టీడీపీని వ్యతిరేకించే శక్తులకు సంతోషంగా ఉంటుంది. దీనివల్ల ఏపీలో వైసీపీకి పెద్ద ప్రయోజనం ఉండకపోయినా, తెలంగాణలో ఆ పార్టీ అభిమానులుగా ఉన్నవారిలో సంతృప్తి కలిగిస్తుంది. ఇప్పటికే పలు సర్వేలు కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి రావచ్చని సూచిస్తున్నాయి. ఇది చంద్రబాబు అరెస్టు వల్ల వచ్చిన సానుభూతి అని టీడీపీ మద్దతు మీడియా ప్రచారం చేస్తుంది. ఆ వర్గం టివీ చానల్‌లో ఇప్పటికే  దీనిపై చర్చ జరిగింది.

✍️కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న ఒక సర్వే సంస్థ ప్రతినిధి అదే చర్చలో తమకు చంద్రబాబు అరెస్టు సానుభూతి  ప్రభావం ఎక్కడా కనిపించలేదని చెప్పడంతో ఆ టీవీవారు అవక్కాయ్యారు. అలాగే చంద్రబాబు బహిరంగంగా ఏ సంగతి చెప్పలేని నిస్సహాయస్థితి. ఆయన ఎప్పుడూ చేసే తెరచాటు రాజకీయం నెరపవచ్చు. సోషల్ మీడియాలో ఇదేదో తమ గొప్పగా కూడా ప్రచారం చేసుకున్నా ఆశ్చర్యం లేదు. అయినా ఏపీలో ఈ కారణంగా ఓట్లు వేస్తారని అనుకుంటే భ్రమే. అక్కడి పరిస్థితుల ఆధారంగానే ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. జనసేన అభ్యర్ధులు ఎవరైనా ఒకరు గెలిస్తే అదే తమకు గొప్ప విజయంగా ఆ పార్టీవారు ప్రచారం చేసుకుంటారు.

✍️ఎవరూ గెలవకపోతే మాత్రం జనసేన నీరుకారిపోతుంది. దీంతో ఏపీలో కూడా పవన్ కళ్యాణ్ బలం పై పూర్తి సంశయాలు వస్తాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వారు పవన్‌ను చులకనగా తీసుకుని బాగా తక్కువ సీట్లు కేటాయించడానికి ప్రయత్నిస్తారు. కాగా టీడీపీ అభిమానులకు, కమ్మ సామాజికవర్గం వారికి కాపునాడు ఒక విజ్ఞప్తి చేసింది. దీని ప్రకారం కుకట్‌పల్లి వంటి నియోజకవర్గాలలో కమ్మ వారంతా జనసేనకు ఓట్లు వేయాలని కోరింది. కాని అక్కడ కాంగ్రెస్ అభ్యర్ధి కమ్మ వర్గం అయినందున వారిలో ఎక్కువమంది అటువైపే మొగ్గు చూపారని అంటున్నారు. తత్ఫలితంగా జనసేన అభ్యర్ధి అక్కడ ఓడిపోతే, ఈ రెండు పార్టీల మధ్య, ముఖ్యంగా కమ్మ, కాపు వర్గాల మధ్య అంతరం ఏర్పడుతుంది.

✍️జనసేనకు కమ్మ సామాజికవర్గం మద్దతు ఇవ్వనప్పుడు తాము ఏపీలో ఎందుకు టీడీపీకి మద్దతు ఇవ్వాలని కాపు సామాజికవర్గ నేతలు, జనసేన కార్యకర్తలు ప్రశ్నిస్తారు. దీనికి సమాధానం ఇవ్వడం పవన్‌కు కష్టం అవుతుంది. దాంతో ఈ రెండు పార్టీల పొత్తు మీద అనుమానాలు ఏర్పడతాయి. పవన్ కోరుకున్నట్లు టీడీపీకి ఎందుకు సరెండర్ అవ్వాలని అడుగుతారు. ఈ నేపథ్యంలో పవన్ ముందస్తుగా ఏపీలో పార్టీ సమావేశం జరిపి టీడీపీతో పొత్తు గురించి వ్యతిరేక వ్యాఖ్యలు చేయవద్దని కార్యకర్తలను హెచ్చరించారని భావించవచ్చు.  కాంగ్రెస్ కనుక తెలంగాణలో గెలిస్తే టీడీపీలో కొంత ఆశ ఏర్పడుతుంది.

✍️తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఏపీలోని జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రయత్నించవచ్చు. ఒకవేళ  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ప్రదానంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే  దానిని చంద్రబాబు తనకు అనుకూలంగా మార్చుకునే యత్నం చేస్తారు. దీనివల్ల  ఏపీలో టీడీపీకి ఎంత ప్రయోజనం ఉంటుందో తెలియదు కాని, కొంత నష్టం కూడా ఉండవచ్చు. రేవంత్ మాత్రం తెలివిగా రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి వివాదం ఉండదని,ప్రభుత్వాల మధ్య సంబంధాలు మామూలుగానే ఉంటాయని అంటున్నారు. పైగా చంద్రబాబు తనకు రాజకీయ గురువు కాదని, సహచరులమేనని ఇప్పటికే ఒక ఇంటర్వ్యులో ప్రకటించారు. ఆయన కూడా అనవసరంగా ఏపీతో కయ్యానికి వెళ్లడానికి వెనుకాడవచ్చు. 

✍️బీజేపీ తెలంగాణలో గెలిచే అవకాశం కనబడడం లేదు. అయినా కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చిన టీడీపీపై వారికి కోపం రావచ్చు. ఏపీలో బీజేపీతో కూడా కలవాలన్న టీడీపీ యోచనకు బ్రేక్ పడవచ్చు. కాని జనసేన వారు బీజేపీ నుంచి విడిపోయిన తర్వాతే  టీడీపీతో పొత్తు పెట్టుకోవల్సి ఉంటుంది. దాని ప్రభావం కూడా ఆ రెండు పార్టీల సంబంధాలపై పడవచ్చు. ఏపీలో మాత్రం టీడీపీ, జనసేనలు ప్రస్తుత పరిస్థితిలో కాంగ్రెస్‌తో కలిసే  అవకాశం లేదు. మరో విశ్లేషణ కూడా ఉంటుంది. ఒక వేళ తెలంగాణలో   కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ ఎవరు అధికారంలోకి వచ్చినా ఆ పార్టీల హామీలు వెంటనే అమలు చేయడం అసాధ్యమైన విషయం.

✍️ప్రత్యేకించి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అయితే మరీ కష్టం. ముందుగా రైతు బంధు కింద ఎకరాకు పదిహేనువేల చొప్పున ఇవ్వవలసి ఉంటుంది. అలాగే  రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయలేకపోయినా, వారిచ్చిన గ్యారంటీలను అమలు చేయకపోయినా ఆ పార్టీకి జనంలో వ్యతిరేకత వస్తుంది. ఏపీలో చంద్రబాబు కూడా అలాంటి వాగ్దానాలనే చేసినందున వాటిని జనం నమ్మని పరిస్థితి మరింత గట్టిగా ఏర్పడుతుంది. అందువల్ల తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా, రాకపోయినా ఇబ్బంది తెలుగుదేశం పార్టీకే అవుతుంది తప్ప వైసీపీపై పెద్ద ప్రభావం ఉండదు. ఎందుకంటే ఆ పార్టీ ఇప్పటికే తన వాగ్దానాలను దాదాపు పూర్తిగా అమలు చేసి జనంలో తిరుగుతోంది కనుక.

✍️ఏపీలో బీజేపీ ఎలాంటి వైఖరి అవలంభిస్తుందన్నది తేలవలసి ఉంది. తెలంగాణలో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చిన టీడీపీతో ఏపీలో పొత్తుపెట్టుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వంటివారు కోరుకుంటుండవచ్చు. ఆ ప్రతిపాదనను పార్టీ హైకమాండ్ ఆమోదిస్తుందా? లేదా? అన్నది కూడా చూడవలసి ఉంటుంది. తెలంగాణలో బీజేపీకి మంచి ఓట్ షేర్ వస్తే ఏపీలో కూడా ఆ దిశగా ప్రయత్నాలు  చేయవచ్చు. కాని అది అంత తేలికకాదు. కాకపోతే తెలుగుదేశం పార్టీకి బీజేపీతో ఎలా ఉండాలో తెలియక గందరగోళం అవుతుంది.

✍️బీజేపీని అడ్డం పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ద్వారా జగన్ ప్రభుత్వానికి ఇక్కట్లు సృష్టించాలన్న ప్లాన్ టీడీపీలో ఉంది. అది సాధ్యం కాకపోవచ్చు. ఇక వైసీపీ ఇప్పటికే టీడీపీ, జనసేనల కూటమిని, ఆ పార్టీకి బాకాలు ఊదే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలను ఎదుర్కోవడానికి సిద్దమైనందున తెలంగాణ ఫలితాలు ఎలా ఉన్నా పెద్ద సమస్య కాదు. మొదటినుంచి కూడా వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ  ఎవరితో పొత్తు పెట్టుకోలేదు. అంతేకాదు. టీఆర్ఎస్ రెండు టరమ్‌లు పాలన చేసింది కనుక సహజంగానే వైసీపీకి ఆ పాయింట్ కలిసి వస్తుంది.  దీనిని బట్టి జాగ్రత్తగా పరిశీలిస్తే తెలంగాణలో కాంగ్రెస్ గెలిచినా, బీఆర్ఎస్ గెలిచినా దాని ప్రభావం తెలుగుదేశం, జనసేనలపైనే అధికంగా ఉంటుందని అర్ధం చేసుకోవచ్చు.


-కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

మరిన్ని వార్తలు