30 వాహనాలు..రూ.68.57 లక్షలు..! 

20 Sep, 2022 09:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడి జరిమానా చెల్లించిన ‘టాప్‌ టెన్‌’ వాహనాల జాబితాను మూడు కేటగిరీలుగా ట్రాఫిక్‌ విభాగం అధికారులు రూపొందించారు. డీసీఎం వంటివి, ఆటోలు, ద్విచక్ర వాహనాలు.. ఈ మూడు విభాగాల్లోనూ టాప్‌ టెన్‌ చొప్పున మొత్తం 30 వాహనాలు ఐదేళ్ల కాలంలో ఏకంగా రూ.68,57,230 చెల్లించినట్లు తేలింది. వీటిపైనే ట్రాఫిక్‌ విభాగం 24,510 చలాన్లు జారీ చేసింది.  

  • జరిమానాగా చెల్లించిన టాప్‌ టెన్‌ వాహనాల్లో కమర్షియల్, సరుకు రవాణా కేటగిరీవే ఎక్కువగా ఉన్నాయి. కేవలం పౌరసరఫరాల శాఖతో పాటు అత్యవసర సేవలకు సంబంధించిన రవాణా వాహనాలకే నగరంలో 24 గంటలూ సంచరించే ఆస్కారం ఉంది. మిగిలిన వాణిజ్య వాహనాలు, లారీలను రాత్రి వేళల్లో మాత్రమే సిటీలోకి అనుమతిస్తారు. అయితే నగరంలో నిత్యం శీతల పానీయాల సరఫరా, తినుబండారాలు, సరుకులు డెలివరీ చేసే అనే వాహనాలు సంచరిస్తుంటాయి. ఇవి ఆయా దుకాణాల పని వేళల్లోనే తిరగాల్సి ఉండటంతో నగరంలోకి ప్రవేశించడం అనివార్యం.  
  • ఇలా వచ్చిన వాహనాలకు ట్రాఫిక్‌ పోలీసుల గరిష్టంగా రూ.1000 వరకు జరిమానా విధిస్తుంటారు. నిబంధనల ప్రకారం ఒకసారి జరిమానా విధించిన తర్వాత మళ్లీ 24 గంటల దాటే వరకు మరో జరిమానా విధించడానికి ఆస్కారం లేదు. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న అనేక వాణిజ్య, సరుకు రవాణా వాహనాలు నగరంలో సంచరిస్తున్నాయి. తమ వ్యాపారంలో వచ్చే లాభం కంటే చెల్లించే జరిమానా అతితక్కువ కావడంతో ఈ పని చేస్తున్నాయి. ఈ తరహాకు చెందిన 10 వాహనాలు ఐదేళ్ల కాలంలో రూ.56,43,700 జరిమానాగా చెల్లించాయి. ఇలాంటి వాహనాలు అనుమతి లేని వేళల్లో తిరిగితే ట్రాఫిక్‌ ఇబ్బందులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇకపై 24 గంటలకు ఒక చలాన్‌ కాకుండా ప్రతి ప్రాంతంలోనూ ఓ చలాన్‌ విధించడానికి ఉన్న అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.  
  • కమర్షియల్‌ వాహనాల విషయం ఇలా ఉంటే.. ద్విచక్ర వాహనచోదకులూ ‘రికార్డులు’ సృష్టిస్తున్నారు. టూ వీలర్‌ నడిపే వ్యక్తి కచ్చితంగా హెల్మెట్‌ ధరించాలన్న నిబంధన ఉంది. ఇలా చేయని వారికి ట్రాఫిక్‌ పోలీసులు చలాన్‌ విధిస్తుంటారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పది ద్విచక్ర వాహనాలపైనే ఐదేళ్లల్లో 2,236 ‘హెల్మెట్‌’ జరిమానాలు పడ్డాయి. ఇతర ఉల్లంఘనలతో కలిపి మొత్తం 2,818 చలాన్లకు సంబంధించి ఇవి చెల్లించిన జరిమానా మొత్తం రూ.4,01,370గా ఉంది. ఫైన్‌లను ఈ వాహనచోదకులు పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. ఇక గూడ్స్, సాధారణ ఆటోలు చేసే ఉల్లంఘనల్లో అత్య«ధికం ఓవర్‌ లోడింగ్, రాంగ్‌ పార్కింగ్‌లకు సంబంధించినవే ఉంటున్నాయి. ఈ కేటగిరీలో ‘టాప్‌ టెన్‌’ వాహనాలపై ఐదేళ్లల్లో 6,516 చలాన్లు జారీ కాగా వీటిలో అత్యధికంగా 2,847 సరుకు ఓవర్‌ లోడింగ్‌వే ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో ప్రయాణికులను ఎక్కువగా ఎక్కించుకోవడంపై 2,659, రాంగ్‌ పార్కింగ్‌పై 574 జారీ అయ్యాయి. వీటితో సహా పది వాహనాలు ఐదేళ్లల్లో రూ.8,12,160 జరిమానా చెల్లించాయి.    

(చదవండి: ఫార్ములా- ఈ పనులు రయ్‌ ..రయ్‌)

మరిన్ని వార్తలు