అక్కడ  కోడిగుడ్లు..ఇక్కడ  టమాటాలు

24 Jul, 2023 01:37 IST|Sakshi

363 హైవేపై వేర్వేరు చోట్ల టమాటా, కోడిగుడ్ల వాహనాలు బోల్తా 

వాంకిడి/తాండూరు: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని 363వ నంబర్‌ జాతీయ రహదారిపై రెండు ప్రమాదాలు చోటుచేసుకొన్నాయి. ఒకచోట టమాటాల లోడున్న వాహనం, మరోచోట కోడుగుడ్ల వ్యాన్‌ పల్టీ కొట్టాయి. రూ.11 లక్షల విలువైన టమాటాలు రోడ్డు పొడవునా చిందరవందరగా పడిపోయాయి. మరోచోట రూ.2 లక్షల విలువైన కోడిగుడ్లు పగిలిపోయి కిందపడటంతో రోడ్డంతా పచ్చసొన పరచుకుని వరదలా పారింది.  

పెద్దపల్లి నుంచి కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌కు ఓ వ్యాన్‌ కోడిగుడ్ల లోడ్‌తో వెళ్తోంది. మంచిర్యాల జిల్లా తాండూర్‌ మండలం బోయపల్లి సమీపంలో రెండు బైక్‌లు ఒక్కసారిగా ఎదురు రావడంతో డ్రైవర్‌ వాటిని తప్పించేక్రమంలో వ్యాన్‌ అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో రూ. 2 లక్షల విలువైన గుడ్లన్నీ పగిలిపోగా, అందులోని సొన మొత్తం రోడ్డుపై పచ్చని వరదలా పారింది. అయితే వ్యాన్‌ డ్రైవర్‌ ఎండీ ఆసిఫ్‌ స్వల్పంగా గాయపడ్డాడు. డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో ఇద్దరు ద్విచక్రవాహనదారులు ప్రాణాలతో బయటపడ్డారు. ట్రాఫిక్‌కు కొద్దిసేపు అంతరాయం కలిగింది. పలువురు వాహనచోదకులు జారిపడ్డారు.  
 కర్ణాటక నుంచి రూ.11 లక్షల విలువైన 430 పెట్టెల టమాటాలతో ఓ వాహనం మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు వెళ్తుండగా కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి మండలం సామేలా గ్రామసమీపంలో అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ తిమ్మప్ప స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. టమాటాల పెట్టెలు ధ్వంసమయ్యాయి. రోడ్డు పొడవునా పడిపోయిన టమాటాలను ఏరేందుకు స్థానిక యువకులు సహాయపడ్డారు. సంఘటనాస్థలానికి పోలీసులు చేరుకుని బందోబస్తు నిర్వహించారు.  
 

మరిన్ని వార్తలు