టపాసుల దుకాణంలో ఘోర అగ్నిప్రమాదం.. 12 మంది మృతి

8 Oct, 2023 05:23 IST|Sakshi

12 మంది మృతి.. మరో పది మందికి గాయాలు

పలు వాహనాలు దగ్ధం

తమిళనాడు– కర్ణాటక సరిహద్దుల్లో ఘటన

హోసూరు (తమిళనాడు): హోసూరు–బెంగళూరు జాతీయ రహదారిపై తమిళనాడు సరిహద్దులో ఉన్న అత్తిపల్లి వద్ద శనివారం సాయంత్రం ఓ బాణాసంచా దుకాణంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో రెండు లారీలతో సహా పలు వాహనాలు బూడిదయ్యాయి. 12 మంది కార్మికులు మరణించారు. మరో పదిమంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లోని అత్తిపల్లి వద్ద శనివారం సాయంత్రం నవీన్‌ అనే వ్యక్తికి చెందిన టపాసుల గోదాములోకి లారీల్లో వచ్చిన స్టాక్‌ను 20 మందికి పైగా సిబ్బంది అన్‌లోడ్‌ చేస్తున్నారు. ఈ సమయంలో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. బాణసంచా ధాటికి చెలరేగిన మంటలు పక్క పక్కనే ఉన్న దుకాణాలకు, వాహనాలకు వ్యాపించాయి.

సమాచారం అందుకున్న ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లోని అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రెండు గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపు చేశారు. దుకాణంలో ఉన్న రూ.1.50 కోట్ల విలువైన బాణాసంచాతో పాటుగా ఆస్తినష్టం వాటిల్లినట్లు సమాచారం. దుకాణ యజమాని సహా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని అగ్నిమాపక సిబ్బంది రక్షించి ఆస్పత్రికి తరలించారు.

ఈ ప్రమాదంలో రెండులారీలతో పాలు పలు వాహనాలు దగ్ధమయ్యాయి.  మొత్తం 12 మంది మరణించినట్లు పోలీసులు పేర్కొన్నారు. వీరంతా తమిళనాడు వాసులే.  మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. టపాసులను అన్‌లోడ్‌ చేసే సమయంలో విద్యుత్‌ తీగలు తగలడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
 

మరిన్ని వార్తలు