ప్రధాన ఆస్పత్రుల వద్ద రోగుల సహాయకులకు వసతి

10 Oct, 2021 01:13 IST|Sakshi

అధికారులకు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆదేశం 

దసరా నుంచే అమలు చేయాలని సూచన

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రులకు రోగులతో పాటు వచ్చే సహాయకులకు వసతి కల్పించేందుకు ఆస్పత్రుల పరిసర ప్రాంతాల్లో తగిన ప్రదేశాలను గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రులకు రోగులతోపాటు వస్తున్న సహాయకులు సరైన వసతి, సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులు ప్రస్తావించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలమేరకు శనివారం సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

దసరా పండుగ నుంచే వసతి కేంద్రాలను ప్రారంభించాలని ఆయన అధికారులకు సూచించారు. అలాగే ఈ కేంద్రాల్లో హరేకృష్ణ మిషన్‌ ఫౌండేషన్‌ సహకారంతో సబ్సిడీపై అల్పాహారం, భోజన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వీటిల్లో తాగునీరు, శానిటేషన్‌తోపాటు మహిళా అటెండెంట్లకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, హరేకృష్ణ మిషన్‌ చారిటబుల్‌ ఫౌండేషన్‌ సీఈఓ కౌంతేయ దాస్, సీఎం ఓఎస్‌డీ డాక్టర్‌ గంగాధర్, రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఎం.డి. చంద్రశేఖర్, వివిధ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు