మంత్రి సత్యవతి ఇంటి ముట్టడికి అంగన్‌వాడీల యత్నం

22 Sep, 2023 02:58 IST|Sakshi

సాక్షి, మహబూబాబాద్‌: పనికి తగిన వేతనం ఇవ్వాలని, ఉద్యోగభద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు గురువారం మహబూబాబాద్‌ జిల్లాకేంద్రంలోని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌ ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు బస్టాండ్‌ సెంటర్‌ నుంచి ర్యాలీగా బయలుదేరారు. పోలీసులు అప్రమత్తమై మహబూబాబాద్‌ – నర్సంపేట రోడ్డులో వారిని ఆపేందుకు ప్రయత్నించారు. తర్వాత మంత్రి ఇంటికి వెళ్లే దారిలో బారికేడ్లు ఏర్పాటు చేశారు.

అయితే వాటిని నెట్టుకుంటూ అంగన్‌వాడీ కార్యకర్తలు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, అంగన్‌వాడీలకు మధ్య తోపులాట జరిగింది. చివరికి అంగన్‌వాడీ కార్యకర్తలు మంత్రి ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు మంత్రి ఇంటికి తాళం వేసి బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో వందలాది మంది అంగన్‌వాడీలు మంత్రి ఇంటి ఎదుట బైఠాయించారు. మంత్రి వచ్చి తమ డిమాండ్లపై హామీ ఇవ్వాలని కోరారు. సమస్యను పరిష్కరించే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడీల సంఘం నేతలు సరోజన, హిమబిందు, ఎల్లారీశ్వరి తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు