తెలంగాణలో మరో కొత్త రైల్వే మార్గం

9 Feb, 2023 05:40 IST|Sakshi

ఇటు కర్నూలు.. అటు వాడీ లైన్లను అనుంధానిస్తూ కొత్త మార్గం 

అందుబాటులోకి వచ్చిన మహబూబ్‌నగర్‌ –కృష్ణా రైల్వే లైన్‌ 

మహబూబ్‌నగర్‌–మునీరాబాద్‌ ప్రాజెక్టులో భాగంగా పూర్తి

దానిమీదుగా వెంటనే గూడ్సు రైళ్లకు గ్రీన్‌ సిగ్నల్‌

ప్రధాన మార్గాల్లో ప్యాసింజర్‌ రైళ్లకు ట్రాఫిక్‌ రద్దీ నుంచి కొంత ఊరట 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మరో కొత్త రైల్వే మార్గం అందుబాటులోకి వచ్చింది. మహబూబ్‌నగర్‌– కర్ణాటకలోని మునీరాబాద్‌ మధ్య నిర్మిస్తున్న కొత్త బ్రాడ్‌ గేజ్‌ రైల్వే మార్గానికి సంబంధించి తెలంగాణ భూభాగంలో పనులు పూర్తి చేయటంతోపాటు ఒకవైపు కాచిగూడ–కర్నూలు మార్గాన్ని, మరోవైపు సికింద్రాబాద్‌–వాడీ మార్గాన్ని అనుసంధానించింది. దీంతో ఈ రెండు మార్గాలకు ఇదో కొత్త ప్రత్యామ్నాయ మార్గంగా అవతరించింది. ఈ మార్గాన్ని  ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే దాని మీదుగా తొలుత సరుకు రవాణా రైళ్లను నడపాలని నిర్ణయించింది.

ఇంకా ఈ మార్గాన్ని విద్యుదీకరించలేదు. సెపె్టంబర్‌ నాటికి ఆ పనులు కూడా పూర్తవుతాయి. అప్పటి వరకు గూడ్సు రైళ్లనే తిప్పాలని అధికారులు నిర్ణయించారు. ఇది దేవరకద్ర– జక్లెయిర్‌– మక్తల్‌– మాగనూరు–కృష్ణా మీదుగా నిర్మితమైంది. ఇప్పుడు కర్నూలు మార్గంలో బెంగుళూరు వైపు, వాడీ మార్గంలో వెళ్లే గూడ్సు రైళ్లను ఈ మార్గం మీదుగా మళ్లించటం ద్వారా, వాటి ప్రయాణ సమయం తగ్గటమే కాకుండా, ప్రధాన మార్గాల్లో ఓవర్‌ ట్రాఫిక్‌తో ప్యాసింజర్‌ రైళ్లకు ఎదురవుతున్న ఇబ్బందులను తగ్గించినట్టవుతుంది. దీంతో ఈ కొత్త మార్గానికి ప్రాధాన్యం ఏర్పడింది. 

రూ.943 కోట్లతో నిర్మాణం..: మహబూబ్‌నగర్‌–మునీరాబాద్‌ మార్గాన్ని రూ.­3543 కోట్ల అంచనాతో ప్రారంభించారు. ఇందులో తెలంగాణ పరిధిలో దేవరకద్ర నుంచి కర్ణాటక సరిహద్దులోని కృష్ణా మధ్య 66 కి.మీ. నిడివి ఉంటుంది. తెలంగాణ పరిధిలోని ఈ దూరాన్ని రూ.943 కోట్ల వ్యయంతో చేపట్టారు. ఆ పనులు  ఇప్పుడు పూర్తి చేశారు. దేవరకద్ర–జక్లెయిర్‌ మధ్య 28.3 కి.మీ. దూరాన్ని 2017 మార్చిలో, జక్లెయిర్‌–మక్తల్‌ మధ్య 11.5 కి.మీ. దూరాన్ని 2020లో, మక్తల్‌–మాగనూరు మధ్య ఉన్న 13.3 కి.మీ. నిడివిని 2022 మార్చిలో పూర్తి చేశారు. మాగనూరు–కృష్ణా మధ్య 12.7 కి.మీ. నిడివిని ఇప్పుడు పూర్తి చేశారు. దీంతో తెలంగాణ పరిధిలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన 66 కి.మీ. మొత్తం పని పూర్తయింది. దేవరకద్ర వద్ద ఇది కర్నూలు లైన్‌తో, కృష్ణా దాటాక వాడి లైన్‌తో అనుసంధానమైంది. దీంతో ఇటు కర్నూలు మీదుగా వెళ్లాల్సిన రైళ్లు, అటు వాడీ మీదుగా వెళ్లాల్సిన రైళ్లను ఈ మార్గం మీదగా నడిపించేందుకు వీలు కలిగింది.

హైదరాబాద్‌ నుంచి రాయచూర్, గుంతకల్, బళ్లారి, హుబ్లీ, గోవా తదితర ప్రాంతాలకు ఈ మార్గం మీదుగా తక్కువ సమయంలో వెళ్లే వీలుంటుంది. బెంగళూరుకు కూడా ఇది ప్రత్యామ్నాయ లైన్‌గా ఉండనుంది. ఆయా ప్రాంతాల్లోని విద్యుదుత్పత్తి, సిమెంటు తదితర పరిశ్రమలకు సరుకు రవాణా చేసే రైళ్లకు ఇది ముఖ్య మార్గంగా మారుతోంది. దీంతో ఈ మార్గంలో వెంటనే గూడ్సు రైళ్లను నడిపేందుకు అధికారులు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ కీలక మార్గాన్ని పూర్తి చేయటంలో శ్రమించిన అధికారులు, సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ అభినందించారు. 

మరిన్ని వార్తలు