భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక

25 Jul, 2021 02:32 IST|Sakshi

ఏజెన్సీలో గ్రామాల నడుమ నిలిచిపోయిన రాకపోకలు

భద్రాచలం/బూర్గంపాడు: భద్రాచలం వద్ద గోదావరి రెండో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తోంది. శనివారం ఉదయం 8 గంటలకు 43.10 అడుగుల నీటిమట్టం నమోదు కాగా, మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆ తర్వాత క్రమేపీ పెరుగుతూ రాత్రి 11.00 గంటల సమయంలో 48.50 అడు గులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. దీంతో దేవస్థానం వైపు కరకట్ట దిగువ భాగాన ఉన్న స్నానఘాట్లు పూర్తిగా మునిగిపోగా, కల్యాణ కట్టపైకి వరద చేరింది. కరకట్టల వద్ద స్లూయిస్‌లను మూసివేయటంతో భద్రాచలంలో వరద నీరు ఆగిపోయింది.

ఆలయం పడమర మెట్ల వద్దకు చేరిన వరద నీరు 

దీంతో రామాలయ నిత్యాన్నదాన సత్రం వద్దకు వరద నీరు చేరుకుంది. భద్రాచలంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు లోతట్టు కాలనీల ప్రజలను తరలించారు. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు వద్ద మధ్యాహ్నం 12 గేట్ల ద్వారా 13,888 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. చర్ల, వెంకటాపురం మండలాల నడుమ ప్రధాన రహదారిపై నీరు చేరటంతో రాకపోకలు నిలిచిపోయాయి. పర్ణశాలకు పూర్తిగా వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ భద్రాచలంలో బస చేసి అధికారులను అప్రమత్తం చేస్తూ, పునరావాస చర్యలను సమీక్షిస్తున్నారు.

వరద ఉధృతితో కల్యాణ కట్టలోకి చేరిన నీరు 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు