భద్రాద్రి: వేట కొడవళ్లతో గుత్తికోయల దాడి.. ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు మృతి

22 Nov, 2022 17:06 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం:  కలకలం సృష్టించిన గుత్తి కోయల దాడి ఘటనలో ఫారెస్ట్‌ అధికారి మృతి చెందారు. పోడు భూములకు సంబంధించి గుత్తికోయలకు , ఫారెస్ట్ అధికారులకు మధ్య మంగళవారం గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడ్డ ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 

చంద్రుగొండ మండలం బెండలపాడులో మంగళవారం ఈ దాడి ఘటన చోటు చేసుకుంది. ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్‌ను వెంటాడి మొదటి కర్రతో దాడి చేశారు. కిందపడిపోయిన తర్వాత వేట కొడవళ్లు, గొడ్డళ్లతో దాడి చేశారు. ఘటన గురించి తెలిసిన వెంట హుటాహుటిన చండ్రుగొండ చేరుకున్నారు డీఎస్పీ వెంకటేశ్వరబాబు, సీఐ వసంత్ కుమార్‌లు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతోన్న శ్రీనివాస్‌ను చంద్రుగొండ పిహెచ్‌సీకి తరలించారు. పరిస్తితి విషమించడంతో ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ  ఆయన కన్నుమూశారు.

గత కొంతకాలంగా ఫారెస్ట్ అధికారులకు, ఆదివాసులకు మధ్య పోడు భూముల విషయంలో వరుసగా జరుగుతున్న వివాదాలు ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. బెండలపాడు సమీపంలోని ఎర్రబొడు అటవీప్రాంతంలో గుత్తికోయలు పోడు వ్యవసాయం చేసుకుంటున్న భూముల్లో గతంలో  ఫారెస్ట్ అధికారులు మొక్కలు నాటారు. ఈ నాటిన మొక్కల్ని తొలగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో పలుమార్లు ఫారెస్ట్ అధికారులకు, పోడు రైతులకు మధ్య గొడవ కూడా జరిగింది. గతంలో లాఠీఛార్జ్ సైతం చేశారు. తాజాగా ఫారెస్ట్ అధికారులు ప్లాంటేషన్ చేయడాన్ని నిరసిస్తూ ఇవాళ మళ్లీ భూముల్లో అధికారులను నాటిన మొక్కల్ని ధ్వంసం చేశారు గుత్తికోయలు. దానిని అడ్డుకునే క్రమంలో అధికారులు, గుత్తి కోయలకు మధ్య వాగ్వాదం జరిగింది.  ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావుపై వేట కొడవళ్లతో దాడి చేశారు.

మరిన్ని వార్తలు