బీజేపీ కార్యకర్త శ్రీనివాస్‌ మృతి

5 Nov, 2020 14:26 IST|Sakshi

బండి సంజయ్‌ను వేధిస్తున్నారంటూ శ్రీనివాస్‌ ఆత్మహత్యాయత్నం

సాక్షి, హైదరాబాద్‌ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్ట్‌ను నిరసిస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బీజేపీ కార్యకర్త గంగుల శ్రీనివాస్‌ మృతి చెందాడు. ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నవంబర్‌ 1న బీజేపీ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేసుకోగా.. నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించిన విషయం విదితమే. 44 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరగా.. మెరుగైన చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే గురువారం మధ్యాహ్నం నాటికి ఆయన మృతి చెందాడు. దీంతో ఆస్పత్రి వద్ద బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

ఇటీవల బండి సంజయ్‌ను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అరెస్ట్‌ చేయడానికి వ్యతిరేకంగా రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తమ్మలానిగూడెంకు చెందిన శ్రీనివాస్ వంటిపై పెట్రోల్‌ పోసుకుని బీజేపీ కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, ప్రేమేందర్ రెడ్డి తదితరులు పరామర్శించారు. శ్రీనివాస్‌కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.

మరిన్ని వార్తలు