హుజూరాబాద్‌లో దళితబంధుకు బ్రేక్‌

19 Oct, 2021 02:45 IST|Sakshi

ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు అమలు వాయిదా: ఈసీ  

సాక్షి, హైదరాబాద్‌: హుజూరాబాద్‌ శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక ముగిసే వరకు నియోజకవర్గ పరిధిలో దళితబంధు పథకం అమలును వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. పథకం కింద అన్ని దశలలోని నగదు బదిలీ ప్రక్రియను నిలుపుదల చేయాలని కోరింది. ఈ విషయంలో తీసుకున్న చర్యలను మంగళవారం మధ్యాహ్నం 2 గంటలోగా తమకు నివేదించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) శశాంక్‌ గోయల్‌ను ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఎన్ని కల సంఘం ముఖ్యకార్యదర్శి అవినాశ్‌కుమార్‌ సోమవారం సీఈఓకు లేఖ రాశారు. దళితబంధు పథకంపై ఈ నెల 8న సీఈఓ పంపిన లేఖ ఆధా రంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తాజా లేఖలో పేర్కొన్నారు. ఈసీఐ నుంచి వచ్చిన ఆదేశాల అమలుకు చర్యలు తీసుకోవాలని కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినట్టు సీఈఓ శశాంక్‌ గోయల్‌ ‘సాక్షి’కి తెలిపారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని నాలుగు మండలాలు, వాసాలమర్రి గ్రామంలో దళితబంధు పైలట్‌ ప్రాజెక్టును ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే.  
దళితబంధుకు రూ.250 కోట్లు విడుదల 
ఇదిలా ఉంటే... రాష్ట్రంలోని 4 మండలాల్లో దళితబంధు పైలట్‌ ప్రాజెక్టు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారమే రూ.250 కోట్లను మంజూరు చేసింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఈ నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలానికి రూ.100 కోట్లు, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిర్మలగిరి మండలం, నాగర్‌ కర్నూల్‌ జిల్లా అచ్చంపేట కల్వకుర్తి నియోజకవర్గంలోని చారగొండ మండలం, కామారెడ్డి జిల్లా జుక్కల్‌ నియోజకవర్గంలోని నిజాంసాగర్‌ మండలానికి చెరో రూ.50 కోట్లను విడుదల చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు