మా డేటా మాదే..!

14 Oct, 2022 03:03 IST|Sakshi

యూడైస్‌ ప్లస్‌ ద్వారా ప్రత్యేక సమాచారం కోరుతున్న కేంద్రం 

మా మాట వినకుంటే పథకాల్లో కోత అంటూ హెచ్చరిక  

సాక్షి, హైదరాబాద్‌: విద్యాశాఖకు సంబంధించిన సమగ్ర సమాచారం తమకు ప్రత్యేకంగా ఇవ్వాలని కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. రాష్ట్రాలు ఇప్పటికే అమలు చేస్తున్న విద్యాలయాలకు సంబంధించిన సమగ్ర సమాచార నిధి(డేటా బేస్‌) యు–డైస్‌(డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం ఫర్‌ ఎడ్యుకేషన్‌)తో తమకు సంబంధం లేదని పేర్కొంది. యూడైస్‌ ప్లస్‌ పేరుతో కేంద్రం సరికొత్త పోర్టల్‌ను సృష్టించింది.

విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, ఖాళీల వివరాలు ఇందులో నమోదు చేయాల్సి ఉంటుంది. స్కూళ్లలో మౌలిక వసతులు, ఆధార్‌ అనుసంధానం, మధ్యాహ్న భోజన వివరాలను యూడైస్‌ ప్లస్‌లో అందించాలి. అందులో అడిగిన మేరకు సమాచారం అందించాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో పాఠశాలల్లో నడిచే కార్యక్రమాలకు ఇదే కీలకమని భావిస్తోంది. ఈ నేపథ్యంలో యూడైస్‌ ప్లస్‌ ద్వారా సమాచారం ఇవ్వకపోతే నిధుల విడుదల కష్టమని హెచ్చరించినట్టు తెలిసింది.  

నేడు, రేపు సదస్సు 
యూడైస్‌ ప్లస్‌పై సమగ్ర అవగాహన కల్పించేందుకు శుక్ర, శనివారాల్లో విజయవాడలో ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, అండమాన్‌ నికోబార్, లక్షద్వీప్‌ ప్రాంతాలకు చెందిన రాష్ట్రస్థాయి సమన్వయకర్తలు ఈ సదస్సులో పాల్గొనాలని సూచించింది. వీరి ద్వారా జిల్లాస్థాయిలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.

జిల్లాస్థాయిలో సమాచారాన్ని నిక్షిప్తం చేసే ఏఎస్వోలకు కొత్త విధానంపై సంపూర్ణ అవగాహన కలిగించి ఏమైనా సందేహాలుంటే శిక్షణ పొందినవారు నివృత్తిచేస్తారు. ’డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్, లిటరసీ, న్యూఢిల్లీ వారి ఆధ్వర్యంలో సదస్సు జరుగుతోంది. ‘యు–డైస్‌ ప్లస్‌’ కార్యాచరణపై కేంద్రం అన్ని జిల్లాల్లోని డీఈవో కార్యాలయాలకు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది.    

మరిన్ని వార్తలు