గింజ కోత పెట్టినా ఉపేక్షించం 

26 May, 2023 02:55 IST|Sakshi

రైతుకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వానికి సహకరించాల్సిందే 

సీఎంఆర్‌ బియ్యాన్ని నిర్ణీత గడువులోగా ఇవ్వాల్సిందే 

మిల్లర్లతో భేటీలో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రైతుల నుంచి సేకరించే ధాన్యంలో ఒక్క గింజ కోత పెట్టినా ఉపేక్షించేది లేదని, మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే అన్‌లోడింగ్‌ చేపట్టాలని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ హెచ్చరించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ రైతులకు ఇబ్బంది కలగకుండా మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించాల్సిందేనన్నారు.

యాసంగి ధాన్యం సేకరణ, సీఎంఆర్‌ బియ్యం, నూక శాతం తదితర అంశాలపై సచివాలయంలో ఆయన మిల్లర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కమలాకర్‌ మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం పనిచేసే ప్రభుత్వం తమదని, విపరీత పరిస్థితుల్లోనూ దేశంలో ఎక్కడా లేనివిధంగా కనీస మద్దతు ధరతో ధాన్యాన్ని సేకరించడమే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.

యాసంగి ధాన్యంలో నూక శాతంపై నిపుణుల కమిటీ గతంలో ఇచ్చిన మధ్యంతర నివేదికను ప్రస్తుత పరిస్థితులకు ఎలా అన్వయించాలో సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వంతోపాటు మిల్లర్లు నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని చెప్పిన మంత్రి... నిర్ణీత గడువులోగా సీఎంఆర్‌ బియ్యాన్ని ప్రభుత్వానికి మిల్లర్లు అందజేయాలని సూచించారు. 

నూక శాతాన్ని త్వరగా తేల్చాలి... 
తమ సమస్యలను మిల్లర్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నూక శాతం విషయాన్ని ప్రభుత్వం త్వరగా తేల్చాలని విజ్ఞప్తి చేశారు. తమను రైతులకు శత్రువులుగా ప్రచారం చేయడం బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.  

ఈ సమావేశంలో పౌరసరఫరాల కమిషనర్‌ అనిల్‌కుమార్, జనరల్‌ మేనేజర్‌ శ్రీనివాసరావు, రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గంపా నాగేందర్, ప్రధాన కార్యదర్శి సుధాకర్‌రావు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బి. ప్రభాకర్‌రావు, కోశాధికారి చంద్రపాల్‌తోపాటు అన్ని జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు