ముగ్గురు మంత్రులు.. 3 జిల్లాలు

27 Feb, 2021 01:41 IST|Sakshi

మండలి పట్టభద్రుల కోటా ఎన్నికలకు ఇన్‌చార్జీల నియామకం

టీఆర్‌ఎస్‌ ప్రచార వ్యూహంపై కేసీఆర్‌ దిశానిర్దేశం

సాక్షి, హైదరాబాద్‌: శాసనమండలి ‘హైదరాబాద్‌– రంగారెడ్డి–మహబూబ్‌నగర్‌’ పట్టభద్రుల నియో జకవర్గానికి చివరి నిమిషంలో అభ్యర్థిని ప్రకటించిన టీఆర్‌ఎస్‌.. ప్రచార వ్యూహాన్ని పక్కాగా అమలు చేయడంపై దృష్టి సారించింది. ఎన్నికలు జరిగే మూడు జిల్లాలకు ముగ్గురు మంత్రులను ఇన్‌చార్జీలుగా నియమించింది. ఉమ్మడి హైదరాబాద్‌ జిల్లాలో గంగుల కమలాకర్, రంగారెడ్డిలో హరీశ్‌రావు, మహబూబ్‌నగర్‌లో వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రచార వ్యూహాన్ని పర్యవేక్షిస్తారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ఆ ముగ్గురు మంత్రులతో శుక్రవారం ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె వాణీదేవి.. ‘హైదరాబాద్‌–రంగారెడ్డి– మహబూబ్‌నగర్‌’ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో అనుసరించాల్సిన ప్రచార, సమన్వయ వ్యూహంపై ఇన్‌చార్జి మంత్రులకు దిశానిర్దేశం చేశారు.

నేడు 43 నియోజకవర్గాల్లో సమావేశాలు
పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల పరిధిలోని 43 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో శనివారం టీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నది. ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రచార వ్యూహాన్ని ఈ సమావేశాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలకు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు వివరిస్తారు. ఎన్నికల ఇన్‌చార్జీలుగా నియమితులైన ముగ్గురు మంత్రులు మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌ జిల్లాలకు చెందిన ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, ఇతర ముఖ్య నేతలకు అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాల వారీగా ప్రచార, సమన్వయ బాధ్యతలు అప్పగించేలా శుక్రవారం రాత్రి కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. పార్టీ అభ్యర్థి వాణీదేవి కూడా శనివారం జోగులాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.   

మరిన్ని వార్తలు