Elections In Telangana: ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్‌ క్లారిటీ

15 Nov, 2022 17:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉండొచ్చన్న ఊహాగానాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన మంగళవారం టీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. బీజేపీ నేతలు కవితను పార్టీ మారమని అడిగారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా?. ఎన్నికలు సమీపించే కొద్ది బీజేపీ  రోజురోజుకు మరింతగా రెచ్చిపోతుంది. పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ హెచ్ఛరికలు జారీ చేశారు. అనవసర విషయాల జోలికి వెళ్లొద్దు. వివాదాస్పద విషయాల్లో తలదూర్చొద్దు అని హుకుం జారీ చేశారు. ఐటి, ఈడి, సిబిఐ దాడులకు భయపడాల్సిన పనిలేదన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదు. షెడ్యూల్‌ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరగుతాయని స్పష్టం చేశారు.

పార్టీని బలోపేతం చేసే దిశగా ఈ 10 నెలలు కష్టపడాలని చెప్పారు. మంత్రులు తమ నియోజకవర్గాలకు పరిమితం కాకుండా అంతటా తిరగాలన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఎమ్మెల్యేలు ఎవరి ప్రలోభాలకు లొంగొద్దని అన్నారు. మునుగోడు ఫలితాల్లో మెజారిటీ తగ్గడంపై పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్‌ సీరియస్‌ అయ్యారు. మళ్లీ సిట్టింగ్‌లకే టికెట్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. మంత్రులు ఎమ్మెల్యేల గెలుపు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. మూడోసారి కూడా మనదే గెలుపు అని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

చదవండి: (ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు నిర్వహిస్తాం: సీఎం కేసీఆర్‌)

మరిన్ని వార్తలు