Mallu Swarajyam: అరుణ కిరణం అస్తమించింది

20 Mar, 2022 00:59 IST|Sakshi

సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ఇకలేరు

11ఏళ్ల వయసులోనే పోరుబాట 

భూస్వామ్య కుటుంబంలో పుట్టి పేదల కోసం ఆరాటం 

రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రజాసేవ  

91 ఏళ్ల వయసులో అనారోగ్యంతో హైదరాబాద్‌లో కన్నుమూత 

సాక్షి, హైదరాబాద్, నల్లగొండ, సూర్యాపేట, తుంగతుర్తి: ఎర్ర మందారం నేల రాలింది. అస్థిత్వం కోసం.. వెట్టి, బానిసత్వం విముక్తి కోసం బరిసెలు ఎత్తి, బాకుల్‌ అందుకొని, బందూకుల్‌ పట్టిన ధీర నింగికెగిశారు. జీవితాంతం సుత్తికొడవలి, చుక్క గుర్తుతోనే సాగిన పోరు చుక్క.. తారల్లో కలిశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం యోధు రాలు మల్లు స్వరాజ్యం(91) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి 8 గంటలకు తుది శ్వాస విడిచారు. కొన్నాళ్లుగా మూత్రపిండాల సమస్యతో బాధ పడుతున్న ఆమెకు ఈనెల 1వ తేదీన ఊపిరితిత్తుల్లోనూ ఇన్‌ఫెక్షన్‌ వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. 2వ తేదీ మధ్యాహ్నానికి నిమోనియాతో పరిస్థితి విషమంగా మారడంతో ఆమెను వెంటిలేటర్‌పై ఉంచారు. ఆరోగ్యం కాస్త మెరుగు కావడంతో ప్రత్యేక గదికి తరలించి వైద్య సేవలందించారు. అంతా బాగుందనుకున్నా శుక్రవారం మళ్లీ ఆరోగ్యం దెబ్బతింది. దీంతో మళ్లీ ఐసీయూకు తరలించారు. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అంది స్తుండగానే శరీరంలోని అన్ని అవయవాలూ ఫెయిల్‌ కావడంతో పరిస్థితి విషమించి శనివారం రాత్రి కన్నుమూశారు.  

మెడికల్‌ కళాశాలకు పార్థివదేహం.. 
ప్రజల సందర్శనార్థం ఆదివారం ఉదయం 6 నుం చి 10 గంటల వరకు ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌లో భౌతికకాయం ఉంచుతారు. తర్వాత పార్థివదేహాన్ని నల్లగొండకు తరలిస్తారు. మధ్యాహ్నం 12 నుంచి 3.30 గంటలవరకు నల్లగొండ జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రజలు పార్టీ శ్రేణుల సందర్శణార్థం ఉంచుతారు. తర్వాత ర్యాలీగా ప్రభుత్వ జన రల్‌ ఆస్పత్రి వరకు తీసుకెళ్తారు. అక్కడ మెడికల్‌ కళాశాలకు మల్లు స్వరాజ్యం పార్థివదేహాన్ని అప్పగించనున్నారు. 

భూస్వామ్య కుటుంబంలో పుట్టినా..
స్వరాజ్యం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కరివిరాల కొత్తగూడెం గ్రామంలో భీంరెడ్డి రాం రెడ్డి–చొక్కమ్మ దంపతులకు 1931లో జన్మించారు. రాంరెడ్డికి ఐదుగురు సంతానం. నర్సింహారెడ్డి, శశిరేఖ, సరస్వతి, స్వరాజ్యం, కుశలవరెడ్డి. భూస్వామ్య కుటుంబంలో పుట్టినా అణగారిన వర్గాల  కోసం పాటుబడిన ధీశాలి. దున్నే వాడికే భూమి కావాలని, దొరల పాలన పోవాలని 11 ఏళ్లప్పుడే పోరుబాట పట్టారు. ఆంధ్ర మహాసభ పిలుపుతో తన పొలంలో పండిన ధాన్యాన్ని పేదలకు పంచారు.  

ఉద్యమ సహచరుడితో వివాహం..
సాయుధ పోరాటం తర్వాత ఉద్యమ సహచరుడు మల్లు వెంకటనర్సింహారెడ్డితో 1954 మే నెలలో స్వరాజ్యం వివాహం జరిగింది. హైదరాబాద్‌ ఓల్డ్‌ ఎమ్మెల్యే కార్వర్ట్స్‌లోని దేవులపల్లి వెంకటేశ్వరరావు నివాసంలో నాయకులు బద్దం ఎల్లారెడ్డి, చండ్ర రాజేశ్వరరావుల సమక్షంలో ఆర్భాటాలు లేకుండా పెళ్లిచేసుకున్నారు. వెంకటనర్సింహారెడ్డి స్వస్థలం ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలోని మావిళ్లమడువ. వీరు సూర్యాపేట మండలం రాయినిగూడెంలో స్థిరపడ్డారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా, ఉమ్మడి నల్లగొండ జిల్లా సీపీఎం కార్యదర్శిగా పనిచేసిన నర్సింహారెడ్డి 2004 డిసెంబర్‌ 4న మరణించారు. వీరికి ముగ్గురు సంతానం. కుమార్తె కరుణ, కుమారులు గౌతంరెడ్డి, నాగార్జునరెడ్డి. పెద్దకుమారుడు గౌతం రెడ్డి ప్రభుత్వ హోమియో వైద్యుడిగా పనిచేసి రిటైర్‌ అయ్యారు. మిర్యాలగూడ డివిజన్‌లో సీపీఎం నాయకుడిగా కొనసాగుతున్నారు. కుమార్తె కరుణ బ్యాంకు ఉద్యోగిగా పనిచేసి వీఆర్‌ఎస్‌ తీసుకున్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి మిర్యాలగూడ ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర నాయకురాలిగా ఉన్నారు. చిన్న కుమారుడు నాగార్జునరెడ్డి న్యాయవాది. ప్రస్తుతం ఆయన సీపీఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నారు. చిన్న కోడలు లక్ష్మి మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలిగా ఉన్నారు. 

పోరాటమే ఊపిరిగా.. 
నైజాం సర్కార్‌కు వ్యతిరేకంగా నాడు తన అన్న భీంరెడ్డి నర్సింహారెడ్డి, బావ రాజిరెడ్డిలతో కలిసి స్వరాజ్యం సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. తన మాటలు, పాటలు, ప్రసంగాలతో మహిళలను ఆకర్షించి వారూ ఉద్యమంలో పాల్గొనేలా చేశారు. దొరల దురహంకారాన్ని ప్రశ్నిస్తూ పాటల ద్వారా ప్రజలను చైతన్యపరిచారు. 1945–48 సంవత్సరాల మధ్య తెలంగాణ సాయుధ పోరాటంలో స్వరాజ్యం క్రియాశీలక పాత్ర పోషించారు. సాయుధ పోరాటంలో ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్‌ జిల్లాలో పని చేశారు. గెరిల్లా దళాలతో దాడులు చేస్తూ నైజాం సర్కారును గడగడలాడించారు. అజ్ఞాతంలో ఉండి రాజక్క పేరుతో దళాలను నిర్మించి, నడిపించారు. స్వరాజ్యాన్ని పట్టుకోవడానికి వీలుకాకపోవడంతో నైజాం పోలీసులు ఆమె ఇంటిని తగులబెట్టినా వెరవకుండా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఆమెను పట్టుకున్నవారికి రూ.10 వేలు బహుమతి ఇస్తామని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. 

రాజకీయ ప్రస్థానం ఇలా.. 
సాయుధ పోరాటం ముగిసిన తర్వాత స్వరాజ్యం రాజకీయాలలోకి వచ్చారు. రెండు సార్లు శాసనసభకు ఎన్నికై ప్రజాసేవ చేశారు. హైదరాబాదు సంస్థానం విమోచన అనంతరం నల్లగొండ జిల్లా తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1978, 1983లలో రెండు పర్యాయాలు సీపీఐ(ఎం) తరఫున ఎన్నికయ్యారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రానికి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను మంజూరు చేయించారు. అప్పట్లో కార్పస్‌ ఫండ్‌ చెల్లిస్తేనే కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చేది. కానీ, మల్లు స్వరాజ్యం తుంగతుర్తి ప్రాంతం వెనుకబడిన ప్రాంతమని ప్రభుత్వంతో కొట్లాడి కార్పస్‌ ఫండ్‌ చెల్లించకుండానే జూనియర్‌ కళాశాలను మంజూరు చేయించారు. అనేక భూసమస్యలను పరిష్కరించారు.

1985లో ప్రభుత్వం కూలిపోవడంతో.. 1985, 1989 రెండు పర్యాయాలు ఎమ్మెల్యే అభ్యర్థిగా, 1996లో మిర్యాలగూడెం పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పార్టీ నాయకురాలిగా నిరంతరం సభలు, సమావేశాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర మహిళా సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1994లో నెల్లూరు జిల్లా దూబగుంట నుంచి ప్రారంభమైన సారా వ్యతిరేక ఉద్యమంలో స్వరాజ్యం పాల్గొన్నారు. స్వరాజ్యం జీవితకథ ‘నా మాటే తుపాకీ తూటా’పుస్తక రూపంలో ప్రచురించారు. వామపక్షభావాలతో స్త్రీల ఆధ్వర్యంలో మొదలైన పత్రిక ’చైతన్య మానవి’సంపాదకవర్గంలో ఒకరుగా స్వరాజ్యం సేవలు అందించారు. 91 ఏళ్ల వయోభారంలోనూ ఆమె పీడిత ప్రజలకు అండగా పనిచేశారు. 8 దశాబ్దాల కిందట ఎర్రజెండాతో పెనవేసుకున్న మల్లు స్వరాజ్యం జీవితం కడవరకు పోరాట స్ఫూర్తితోనే కొనసాగింది. 

మరిన్ని వార్తలు