45 ఏళ్ల కాంగ్రెస్‌ మనిషికి అవమానం: ఆగ్రహంతో ఊగిపోయిన పొన్నాల.. సముదాయించిన జానారెడ్డి

17 Oct, 2022 11:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికల వేళ.. సోమవారం గాంధీభవన్‌ వద్ద నాటకీయ పరిణామం ఒకటి చోటు చేసుకుంది. పోలింగ్‌ సిబ్బంది తీరుపై సీనియర్‌ నేత పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటరు లిస్ట్‌లో ఆఖరి నిమిషంలో మార్పులు చేర్పులే అందుకు కారణంగా తేలింది.

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల కోసం పీసీసీ ప్రతినిధులకు ఓటు హక్కు ఉంటుంది. అయితే ప్రతీ నియోజకవర్గం నుంచి ఇద్దరికీ మాత్రమే ఓటింగ్‌ అవకాశం ఉంటుంది. జనగామ నుంచి పొన్నాలతో పాటుగా శ్రీనివాసరెడ్డికి ఓటింగ్‌ ఐడీ కార్డు ఇచ్చింది  ఏఐసీసీ. దీంతో.. పొన్నాలతో పాటుగా శ్రీనివాసరెడ్డి ఓటు వేయడానికి గాంధీభవన్‌కు వచ్చారు. అయితే.. 

శ్రీనివాసరెడ్డికి ఓటు హక్కు లేదని అడ్డుకున్నారు గాంధీ భవన్‌ పోలింగ్‌ సిబ్బంది. దీంతో రగడ మొదలైంది. శ్రీనివాసరెడ్డి స్థానంలో ఆ ఓటు హక్కును కొమ్మూరి ప్రతాప్‌ రెడ్డికి కేటాయించినట్లు గాంధీ భవన్‌ ఓటింగ్‌ సిబ్బంది తెలిపారు. దీంతో పొన్నాల అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. అగ్గిమీద గుగ్గిలం అయ్యారు.
 
శ్రీనివాసరెడ్డికి ఓటు నిరాకరించడం ఒక ఎత్తు అయితే.. కొమ్మూరి ప్రతాప్‌కు ఓటు ఇచ్చి తనను అవమానించారంటూ పొన్నాల ఫైర్‌ అయ్యారు.  సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఊగిపోయారు పొన్నాల. 45 ఏళ్ల కాంగ్రెస్‌ మనిషికి అవమానం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న జానారెడ్డి.. పొన్నాలను సముదాయించి పక్కకు తీసుకెళ్లారు. ఈ పంచాయితీపై తేలేవరకు గాంధీ భవన్‌ వీడనని భీష్మించుకుని అక్కడే ఉండిపోయారు పొన్నాల.

>
మరిన్ని వార్తలు