కరోనా వేరియంట్‌ భయం.. గాంధీ ఆసుపత్రి రాజారాం కీలక వ్యాఖ్యలు

19 Dec, 2023 16:17 IST|Sakshi

కరోనా మళ్లీ కలవరపెడుతోంది. రూపం మార్చుకుని మళ్లీ వచ్చేస్తోంది.  కరోనా కొత్త వేరియంట్ JN.1 విజృభిస్తోంది. రెండురోజులుగా కొత్త వేరియంట్ తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఏకంగా మళ్లీ కరోనా మరణాలను గుర్తుచేస్తోంది. అసలు జెఎన్–వన్ వెరియంట్ ఎంటీ? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? కొత్త వెరియంట్ ఎంత వరకు ప్రమాదకరం..

దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య మళ్ళీ పెరుగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్‌ బారినపడి ఆరుగురు మృతి చెందారు. ఈ తాజా పరిణామాలు ప్రజలను మళ్లీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై రాష్ట్రాలకు కీలక సూచనలు జారీ చేసింది.  రెండేళ్ల క్రితం దేశంలో ఒమిక్రాన్ వెరియంట్ వేగంగా విస్తరించింది. చాలా మందిని ఇబ్బందిని పెట్టింది.  అనారోగ్యానికి గురిచేసి అవస్థల పాలు చేసింది. 

తాజాగా ఈ వేరియంట్ నుంచి పుట్టుకొచ్చిన సబ్ వెరియంటే JN-1. ఒమిక్రాన్ రూపం మార్చుకుని జెఎన్‌-1 గా ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఈ వేరియంట్‌లో జ్వరం, ముక్కు కారడం, గొంతునొప్పి, తలనొప్పి లక్షణాలు ఉంటాయి. కొంతమందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తనున్నట్లు వైద్య అధికారులు చెబుతున్నారు. కేసులు పెరిగితే మళ్లీ టెస్టులు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. రాబోయే పండుగల సీజన్ల దృష్ట్యా ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, మాస్కులను ధరించాలని ప్రజలను కోరుతున్నారు.

మరోవైపు.. కరోనా కొత్త వేరియంట్‌ కేసులతో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. కరోనా చికిత్సలకు నోడల్‌ కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రి సిబ్బంది కూడా అప్రమత్తమై.. కొవిడ్ కేసుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎప్పుడు రోగులు వచ్చినా చికిత్సలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు తెలిపారు. ప్రత్యేకంగా కరోనా వార్డ్‌లో బెడ్స్‌ను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఇక, క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల, సంక్రాంతి పండుగ సందర్భంలో కొత్త వేరియంట్ కట్టడి సవాల్‌గా మారనుంది. సో.. బీ కేర్ ఫుల్.. బీ అలెర్ట్.

ఇది కూడా చదవండి: భారత్‌లో కరోనా: జేఎన్‌.1 వేరియెంట్‌ లక్షణాలేంటి?

>
మరిన్ని వార్తలు