కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం

19 Dec, 2023 01:45 IST|Sakshi

అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కేసుల విషయంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సూచన మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ మే రకు అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సోమవారం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో ఈ నెల 8న కోవిడ్‌ కొత్త వేరియంట్‌ జేఎన్‌1 వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించా రు.

రాబోయే పండుగల సీజన్‌ దృష్ట్యా ప్రజలంతా పరిశుభ్రతను పాటించాలని, మాస్కులను ధరిం చాలని సూచించారు. శ్వాసకోశ సమస్యలు ఉన్నవా రు మరింత జాగ్రత్తగా ఉండాలని కోరారు. కాగా, ఎలాంటి సమస్యలు వచ్చినా ఎదుర్కొనడానికి రాష్ట్ర యంత్రాంగం సిద్ధంగా ఉందని, వ్యాధినిర్ధారణ పరీక్షలకు కావాల్సిన కిట్స్, చికిత్సకు అవసరమైన మందులు, ఆక్సిజన్‌ అందుబాటులో ఉన్నాయని మంత్రి వివరించారు. ప్రజలు ఆందోళన చెంద వద్దని, చలికాలం నేపథ్యంలో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు పెరిగే విషయాన్ని గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ప్రమాదకారి కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చింది 
కరోనా గురించి దిగులు చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వార్తల్లో ఉన్న కరోనా వేరియంట్‌ జేఎన్‌1 ఒమిక్రాన్‌కు చెందినదే. ఇది ఇప్పటికే భారత్‌ సహా పలు దేశాల్లో రెండు నెలలుగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇది ప్రమాదకారి కాదని ఇప్పటికే నివేదిక విడుదల చేసింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా శ్వాస కోశ సంబంధ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో వృద్ధులు, దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.  – డాక్టర్‌ కిరణ్‌మాదల, ఐఎంఏ సైంటిఫిక్‌ కన్వీనర్, తెలంగాణ

>
మరిన్ని వార్తలు