వ్యాక్సిన్‌ వేసేందుకు 10 వేల బృందాలు

11 Dec, 2020 08:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వ్యాక్సిన్‌ రాష్ట్రానికి చేరుకున్న వెంటనే బాధితులకు వేసేందుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. అందుకోసం 30 వేల మంది వైద్య సిబ్బందికి జిల్లాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఇన్‌చార్జి, ప్రజారోగ్య డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. ఇప్పటికే రెండ్రోజులు రాష్ట్ర స్థాయి అధికారులకు శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. వారు ప్రతి జిల్లాలో ఏడుగురికి శిక్షణ ఇస్తారు. అనంతరం వారు ఎంపిక చేసిన 30 వేల మంది ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలకు, నర్సులకు శిక్షణ ఇస్తారు. ఈ నెల 14 నుంచి శిక్షణ ప్రారంభం అవుతుందని, 20 లోపు అందరికీ శిక్షణ పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో వ్యాక్సిన్‌ వేసేం దుకు 10 వేల బృందాలను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కో బృందంలో ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్త, నర్సు ఉంటారు. అలా 10 వేల బృందాలు.. అందులో మొత్తం 30 వేల మంది ఉంటారు. వీరికి శిక్షణ ఇస్తూనే.. ఎంపిక చేసిన డాక్టర్లకు కూడా శిక్షణనిస్తారు. వ్యాక్సిన్‌ ఎక్కడైనా వికటించి సమస్య తలెత్తితే ఆ మేరకు చికిత్స అందించేలా డాక్టర్లు ఉంటారు. ప్రతి పీహెచ్‌సీ పరిధిలో ఉన్న వైద్యులకూ శిక్షణ ఉంటుంది.

పోలీసు, రవాణా సిబ్బందికి కూడా..: వైద్య సిబ్బందితో పాటు వ్యాక్సిన్‌లో పాలుపంచుకునే వారికి కూడా శిక్షణ ఇస్తామని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటిం చింది. ఈ మేరకు ఆయా శాఖల అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఏదేమైనా ఈ నెల 20 లోపు శిక్షణ పూర్తి చేస్తారు. ప్రస్తుత సమాచారం ప్రకారం వచ్చే నెల రెండో వారంలో రాష్ట్రానికి వ్యాక్సిన్‌ వచ్చే అవకాశాలున్నాయి. ఫ్రంట్‌లైన్‌ కార్మికులు, 50 ఏళ్లు పైబడిన వారు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి జాబితా తయారు చేసే పనిలో వైద్య, ఆరోగ్య శాఖ నిమగ్నమైంది. వీరి పేర్ల నమోదుకు వైద్య, ఆరోగ్య శాఖ ఒక యాప్‌ను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోని దాదాపు 3 లక్షల మంది జాబితా దాదాపు ఖరారైంది.  

మరిన్ని వార్తలు