తెలంగాణలో టపాసులు బ్యాన్‌

12 Nov, 2020 14:24 IST|Sakshi

హైకోర్టు కీలక ఆదేశాలు

సాక్షి, హైదరాబాద్‌ :  తెలంగాణలో టపాసుల బ్యాన్‌పై రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో టపాసులు ఖచ్చితంగా నిషేధించి తీరాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీచేసింది. ఎవ్వరు క్రాకర్స్ అమ్మడం గాని, కొనడం గాని చేయవద్దని  ఆదేశించింది. రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ పెరుగుతున్న నేపథ్యంలో క్రాకర్స్‌ బ్యాన్‌ చేయాలంటూ న్యాయవాది ఇంద్రప్రకాష్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. క్రాకర్స్ కాల్చడం వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. టపాసుల కారణంగానే శ్వాస కోశ ఇబ్బందులు పడుతారన్న ఆవేదన వ్యక్తం చేశారు. పిటిషనర్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. టపాసులపై బ్యాన్‌ విధించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది.

ప్రజలకు అవగాహన కల్పించండి..
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో క్రాకర్స్ బ్యాన్ చేయడం ఉత్తమమని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇప్పటి వరకు తెరచిన షాపులను మూసి వేయాలని  ఆదేశించింది. ఎవరైనా అమ్మకాలు జరిపితే కేసులు నమోదు చేయాలని హెచ్చరించింది. ప్రచార మాధ్యమాల ద్వారా క్రాకర్స్  కాల్చకుండా ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు టపాసులను నిషేధించిన విషయాన్ని న్యాయస్థానం ఈ సందర్భంగా గుర్తుచేసింది. క్రాకర్స్‌ను బ్యాన్‌ చేయాలంటూ రాజస్తాన్‌ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొంది. ఇక కోల్‌కత్తాలో టపాసులు బ్యాన్‌చేయకపోతే తామే స్వయంగా రంగంలోకి దిగి నిషేదిస్తామని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినట్లు న్యాయస్థానం గుర్తుచేసింది.

దీపావళి నేపథ్యంలో గాలి నాణ్యత మరింత క్షీణించకుండా ఉండటానికి  ఇదివరకే పలు రాష్ట్రాలు టపాసులపై నిషేధం విధిస్తున్న విషయ తెలిసిందే. దేశ రాజధానితో పాటు కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే క్రాకర్స్‌ బ్యాన్‌ చేశారు. 

మరిన్ని వార్తలు