సాంస్కృతిక శాఖ సంచాలకుడు హరికృష్ణకు డాక్టరేట్‌ 

17 Jul, 2022 03:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణకు వరంగల్‌ జానపద గిరిజన విజ్ఞాన పీఠం నుంచి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం డాక్టరేట్‌ పట్టాను ప్రకటించింది. ‘తెలుగు సినిమాల్లో జానపద కథాంశాలు– అధ్యయనం’అనే అంశంపై డా.భట్టు రమేశ్‌ పర్యవేక్షణలో పరిశోధన చేశారు. 1896 నుంచి ఇప్పటివరకు 90 ఏళ్ల తెలుగు సినీ ప్రస్థానంలో 8,600 పైగా చలనచిత్రాలు తెలుగులో నిర్మాణమ­య్యాయని ఈ పరిశోధనలో పేర్కొన్నారు.

1938 ‘గులేబకావళి కథ’తో మొదలైన జానపద సినిమాలు ‘బాహుబలి’వరకు సినీరంగంలో చూపిన ప్రభావాన్ని చారిత్రిక దృష్టితో, సమగ్ర వ్యూహంతో పరిశోధించారని, అంతర్జాతీయంగా వివిధ దేశాల జానపద గాథలు సినిమాలుగా తెరకెక్కిన తీరు, వేర్వేరు భారతీయ భాషల్లో వచ్చిన సినిమాల్లో జానపద కథాంశాల తీరు, తెలుగు సినిమాల్లో జానపద లక్షణాలు, కథాంశాల విశ్లేషణను ఈ పరిశోధనలో అందించారని పరిశీలకులు తెలిపారు. ఇప్పటిదాకా తెలియని ఎన్నో అంశాలను ఈ పరిశోధన వెల్లడి చేసిందని, భవిష్యత్‌ పరిశోధనలకు రిఫరెన్స్‌ పుస్తకంగా నిలుస్తుందని హరికృష్ణను అభినందించారు.   

మరిన్ని వార్తలు