రోడ్డెక్కిన పాడి రైతులు

6 Sep, 2023 04:00 IST|Sakshi

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పాడి రైతులు మంగళవారం రోడ్డెక్కా రు. పాడి రైతులకు లీటరు పాలకు అదనంగా రూ.4 చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ రాస్తారోకో నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్‌కు చేరుకుని సిరిసిల్ల–వేములవాడ ప్రధాన రహదారిపై బైఠాయించారు. 2019 జనవరి నుంచి 56 నెలలుగా పాడి రైతులకు లీటరుకు రూ.4 చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేపట్టారు.

ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులు రోడ్డుపై బైఠాయించడంతో 4 కి.మీ. మేర రెండు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. సిరిసిల్ల టౌన్  సీఐ ఉపేందర్, ఎస్సై మల్లేశ్‌గౌడ్, ట్రాఫిక్‌ ఎస్సై రాజు ఎంత సముదాయించినా వినకుండా రాస్తారోకో చేశారు. పాడి రైతుల ఆందోళనకు బీజేపీ నాయకులు లగిశెట్టి శ్రీనివాస్, రెడ్డబోయిన గోపి, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కాముని వనిత సంఘీభావం తెలుపుతూ రోడ్డుపై బైఠాయించారు.

కాగా, రాస్తారోకోతో కరీంనగర్‌కు పరీక్షలు రాసేందుకు వెళ్లే విద్యార్థులు, ఆస్పత్రికి వెళ్లే రోగులు ఇబ్బందులు పడ్డారు. పరీక్షలకు సమయం దాటిపోతోందని విద్యార్థులు వాపోయారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి స్కూల్‌ బస్‌లో పోలీస్‌ హెడ్‌క్వార్టర్‌కు తరలించారు. 

4 ఏళ్లుగా పాడి రైతులకు మోసం: జీవన్ రెడ్డి 
నాలుగేళ్లుగా తెలంగాణ పాడి రైతులను సీఎం కేసీఆర్‌ మోసగిస్తున్నారని ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో ఫోన్ లో మాట్లాడారు. ఇచ్చిన హామీని నెరవేర్చాలని పాడిరైతులు సిరిసిల్లలో ఆందోళనకు దిగి ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు