పేదరికం వెంటాడుతున్నా.. డ్యాన్స్‌లో దుమ్ములేపుతున్న మహబూబ్‌నగర్‌ కుర్రాడు

24 May, 2022 21:09 IST|Sakshi
రాష్త్రస్థాయి పోటీల్లో ఉత్తమ డాన్సర్‌గా అవార్డు అందుకుంటున్న భరత్‌  

సాక్షి, మహబూబ్‌నగర్‌: డాన్సంటే అతనికి పంచ ప్రాణాలు. ఏ రోజైనా తనను ఉన్నత స్థానంలో నిలబెడుతుందని ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తున్నాడు గండేడ్‌ మండలం బైస్‌పల్లికి చెందిన యువకుడు భరత్‌. బైస్‌పల్లికి చెందిన గత్ప చిన్నయ్య, రుక్కమ్మ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు భరత్‌. ఈ కుటుంబానికి అర ఎకరా పొలమే ఆధారం కావడంతో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఈ క్రమంలో తల్లి రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో తండ్రి మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా.. భరత్‌ మాత్రం డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తూ నృత్యంలో మరింత రాటుదేలాడు.   

40కి పైగా టీవీ షోలు.. 
భరత్‌కు చిన్నతనం నుంచే డాన్సు అంటే అమితాసక్తి. ఇంటర్‌ చదివే సమయంలో కోస్గికి చెందిన శ్రీనివాస్‌ మాస్టర్‌ చేరదీసి రెండేళ్లు శిక్షణ ఇచ్చాడు. అనంతరం ఆ మాస్టారే.. జీ తెలుగు టీవీ చానల్‌లో బిన్ని మాస్టర్‌ కొరిగ్రాఫర్‌ ఉండే ఆటో జూనియర్‌ ప్రోగ్రాంలో మొదటి సారి అవకాశం ఇప్పించాడు. ఇప్పటి వరకు మా టీవీ, జీ తెలుగు, జెమిని, ఈటీవీలలో 40కి పైగా డ్యాన్స్‌ షోల్లో పాల్గొన్నాడు. 2021లో ఢీ షోలో అవకాశం వచ్చింది. అలాగే, పలు రాష్త్రస్థాయి డాన్సు పోటీల్లో అవార్డులు, ప్రశంస పత్రాలు వచ్చాయి.  

వెంటాడుతున్న పేదరికం.. 
తండ్రి చిన్నయ్య రంగారెడ్డిలోని ఓ రైస్‌మిల్లులో కూలీ పనిచేసి అక్కడే ఉంటున్నాడు. ఆర్థికంగా అంతంత మాత్రంగానే ఉండడంతో కొడుకు ఎదుగుదలకు ఆర్థిక సహాయం అందించలేకపోతున్నా డు. అయితే, భరత్‌కు టీవీల్లో జరిగే షోల్లో అంతంతమాత్రంగానే డబ్బులు ఇవ్వడం, ఒక్కోసారి అసలు ఇవ్వకపోవడంతో స్నేహితుల వద్ద అప్పు  చేసి తనకు కావాల్సినవి సమకూర్చుకుంటున్నాడు. అయితే, ఏప్రిల్‌ 17న హైద్రాబాద్‌లో జరిగిన ఆలిండియా రూరల్‌ కాంపిటేషన్స్‌లో సెమీఫైనల్‌కు భరత్‌ సెలెక్టు అయ్యాడు. ఈనెల 27 భూపాల్‌లో జరిగే పోటీలకు వెళ్లాల్సి ఉంది. డబ్బు లేక ఇంకా టికెట్లు కూడా బుక్‌ చేసుకోలేదు.  

దాతలు సహకరిస్తే ప్రతిభ చాటుతా.. 
డ్యాన్స్‌ అంటే చాలా ఇష్టం. భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుతానన్న పట్టుదలే నన్ను ముందుకు నడిపిస్తుంది. ఇప్పటి వరకు స్నేహితుల సహకారంతోనే వెళుతున్నా. ఏదైనా ప్రయివేటు ఉద్యోగం చేద్దామనుకుంటే టీవీ షోలు 15 రోజులు కంటిన్యూగా ఉండడం, మిగతా 15 రోజులకు ఎవరు అవకాశం ఇవ్వడం లేదు. ప్రస్తుతం భూపాల్‌ వెళ్లడానికి కూడా డబ్బులు లేక టికెట్లు బుక్‌ చేసుకోలేదు. దాతలు సహకారిస్తే ప్రతిభ చాటి పుట్టిన ఊరు, జిల్లా, ప్రాంతానికి మంచి పేరు తెస్తా.           – భరత్, డ్యాన్సర్,   బైస్‌పల్లి గండేడ్‌ మండలం 

మరిన్ని వార్తలు