టెట్‌లో తగ్గిన రిజల్ట్‌ 

28 Sep, 2023 01:19 IST|Sakshi

పేపర్‌–1లో 36 శాతం, పేపర్‌–2లో 15.30 శాతం మందే పాస్‌ 

టీచర్‌ పోస్టులు తక్కువనే నిరాశ.. పెద్దగా శ్రద్ధ పెట్టని అభ్యర్థులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ నెల 15న జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. టెట్‌ రెండు పేపర్లకు కలిపి 4,13,629 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా వారిలో 1,11,562 మంది అర్హత పొందారు. పేపర్‌–1ను 2,23,582 మంది రాస్తే 82,489 (36 .98%)మంది అర్హత పొందగా పేపర్‌–2లో మేథ్స్, సైన్స్‌ సబ్జెక్టులను 1,01,134 మంది రాస్తే 18,874 మంది (18.66%), సోషల్‌ స్టడీస్‌సబ్జెక్టును88,913 మంది రాస్తే 10,199 మంది (11.47%) అర్హత సాధించారు. పేపర్‌–2లో 1,90, 047 మందికి గాను 29,073 (15.30%) మంది అర్హత పొందారు. టెట్‌కు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌ https://cgg.gov.inÌలో తుది ‘కీ’తోపాటు ఫలితాలు అందుబాటులో ఉన్నాయని టీఎస్‌ టెట్‌ కన్వీనర్‌ రాధారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.  

పడిపోయిన ఫలితాలు...: ఉమ్మడి రాష్ట్రంలో 2011లో టెట్‌ నిర్వహించగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016 నుంచి ఇప్పటి వరకూ ఐదుసార్లు పరీక్ష జరిగింది. ఇప్పటికే దాదాపు 3.5 లక్షల మంది టెట్‌ అర్హులు రాష్ట్రంలో ఉన్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది టెట్‌ ఫలితాలు దారుణంగా పడిపోయాయి. సాధారణంగా పేపర్‌–1లో 2022లో మినహా అంతకు ముందు రెండేళ్లలో 50 శాతానికిపైగా రిజల్ట్‌ వచ్చింది.

పేపర్‌–2లో మొదట్నుంచీ రిజల్ట్‌ తగ్గుతున్నా ఈసారి అతితక్కువగా 15.30 శాతమే నమోదైంది. గతేడాది ప్రభుత్వం వరుస నోటిఫికేషన్లు ఇవ్వడం, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేస్తామనే ప్రకటనతో అభ్యర్థులు కోచింగ్‌ కేంద్రాలకు వెళ్లి మరీ టెట్‌కు సన్నద్ధమయ్యారు. ఈసారి టీఆర్టీ నోటిఫికేషన్‌ విడుదల చేసినా పోస్టులు తక్కువగా ఉండటం, రోస్టర్‌ విధానం తర్వాత కొన్ని జిల్లాల్లో ఏమాత్రం ఖాళీలు లేకపోవడంతో ఎక్కువ మంది టెట్‌కు ప్రిపేర్‌ కాలేదు. 

టీఆర్టీ దరఖాస్తుకు అర్హులు 
తాజాగా టెట్‌ ఉత్తీర్ణులు ప్రస్తుతం ప్రభుత్వం నియమించే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టెట్‌ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫలితాలు వెల్లడవ్వడంతో ఇందుకు సంబంధించిన ధ్రువపత్రాలు కూడా ఆలస్యం చేయకుండా ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. టీఆరీ్టకి ఇప్పటివరకు పెద్దగా దరఖాస్తులు రాలేదు. కొన్ని జిల్లాల్లో స్థానికత ఉన్నప్పటికీ పోస్టులు లేవని, పోస్టులు ఉన్న చోట నాన్‌–లోకల్‌ కోటాలో వెళ్లినా, ఆ కేటగిరీలో తక్కువ పోస్టులు ఉన్నాయని అభ్యర్థులు టీఆర్టీకి వెనకడుగు వేస్తున్నారు. తాజా టెట్‌ అర్హులు టీచర్‌ పోస్టులకు ఎక్కువగా దరఖాస్తు చేసే వీలుందని భావిస్తున్నారు.  

మరిన్ని వార్తలు