లాక్‌డౌన్‌: పావు తక్కువ పదికే రంగంలోకి పోలీసులు

20 May, 2021 05:17 IST|Sakshi

10 గంటల తర్వాత రోడ్లపై ఎవరూ తిరగకూడదు 

అనుమతిలేని వాహనాలను సీజ్‌ చేయండి  

 ప్రతీ గల్లీలోనూ సైరన్‌తో సంచరించండి 

సీపీలు, ఎస్పీలకు డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: ఉదయం 10 గంటల తరువాత కూడా రోడ్లపై ప్రజలు కనిపిస్తున్నారని, లాక్‌డౌన్‌ కఠిన అమలుకు ఉ.9.45లకే పోలీసులు రంగంలోకి దిగాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. కోవిడ్‌ నియంత్రణలో భాగంగా ఈ నెల 30 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించిన నేపథ్యంలో అనుమతి లేని వాహనాలను సీజ్‌ చేయాలని, ప్రతీ వీధిలోనూ పోలీసు వాహనాలు సైరన్‌ వేసుకుని తిరగాలని సూచించారు.

లాక్‌డౌన్‌ అమలుపై జోనల్‌ ఐజీలు, డీఐజీలు, పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలతో బుధవా రం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. శాంతిభద్రతల విభాగం అడిషనల్‌ డీజీపీ జితేంద ర్, ఇంటెలిజెన్స్‌ విభాగం ఐజీ ప్రభాకర్‌రావు పాల్గొ న్న ఈ కార్యక్రమంలో డీజీపీ మాట్లాడుతూ.. రాష్ట్రం లో లాక్‌డౌన్‌ అమలుతీరును ప్రతిరోజూ జిల్లాల వారీగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్షిస్తున్నారని వెల్లడించారు. మే 30 తర్వాత తిరిగి పొడగించేందుకు వీలులేకుండా ప్రస్తుత లాక్‌డౌన్‌ను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు.  

అంతా ఫీల్డ్‌లో ఉండాల్సిందే.. 
ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్‌డౌన్‌ సడలింపు ఉన్నా.. 8 గంటల తర్వాతే ప్రజలు నిత్యావసరాల కోసం వస్తున్నారని డీజీపీ అన్నారు. మార్కెట్లు, దుకాణాల వద్ద ప్రజలు గుమికూడటం కనిపిస్తోందని, దీనిని నివారించేందుకు ఉదయం 6 గంటల నుంచే తమ అవసరాల కోసం వెళ్లేలా ప్రజలను చైతన్యపర్చాలని సూచించారు. 10 గంటల తర్వాత కూడా వీధుల్లో పెద్ద ఎత్తున జన సంచారం ఉంటోందని, దీని నివారణకు తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఉదయం 9:45 గంటల నుంచే పోలీసు కమిషనర్లు, ఎస్పీలు, డీసీపీ, డీఎస్పీ, ఏసీపీ స్థాయి ఉన్నతాధికారులంతా కచ్చితంగా క్షేత్రస్థాయిలో ఉండి పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.

కరోనా వ్యాప్తికి అవకాశాలు ఉన్న ఫిష్‌ మార్కెట్లు, వెజిటేబుల్‌ మార్కెట్లలో జనం రద్దీని తగ్గించేందుకు మార్కెటింగ్, మున్సిపల్, సంబంధిత శాఖల సమన్వయంతో ఆయా మార్కెట్లను వికేంద్రీకరించేలా చర్యలు చేపట్టాలని తెలియజేశారు. ప్రధాన రహదారుల్లోనే లాక్‌డౌన్‌ అమలు చేయడమే కాకుండా కాలనీలు, అంతర్గత రహదారుల్లోనూ కఠినంగా అమలు జరగాలని పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు అన్ని పెట్రోలింగ్‌ వాహనాలు సైరన్‌ వేసి సంచరించాలని సూచించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు