ధరణి సేవలు ప్రారంభం

3 Nov, 2020 00:54 IST|Sakshi
సోమవారం శంషాబాద్‌లో ధరణి పోర్టల్‌ ద్వారా మొదటి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వారికి పత్రాలు అందజేస్తున్న సీఎస్‌ సోమేష్‌కుమార్‌

రాష్ట్రంలో సాగు భూముల రిజిస్ట్రేషన్లు మొదలు..

శంషాబాద్‌లో తొలి రిజిస్ట్రేషన్‌ పత్రాలను కొనుగోలుదారుకు ఇచ్చిన సీఎస్‌

త్వరలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై సీఎం ప్రకటన

సాక్షి, హైదరాబాద్‌/శంషాబాద్‌ రూరల్‌: ధరణి సేవలు షురూ అయ్యాయి. దాదాపు 2 నెలలుగా నిలిచిన భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల ప్రక్రియ సోమవారం లాంఛనంగా ప్రారంభమ య్యాయి. కొత్త రెవెన్యూ చట్టం నేపథ్యంలో సెప్టెంబర్‌ 9న ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నిలిపివేసింది. ధరణి పోర్టల్‌నే భూరికార్డుగా పరిగణిస్తూ సాగు భూముల రిజిస్ట్రేషన్ల సేవలను తహసీల్దారు కార్యాలయంలోనే నిర్వహించేలా గత సెప్టెంబర్‌లో భూహక్కులు, పట్టాదారు పాస్‌ పుస్తకాల చట్టం –2020(ఆర్వోఆర్‌)ను ప్రభుత్వం తెచ్చింది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు తలపెట్టిన ధరణి పోర్టల్‌ను గతనెల 29న సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. అయితే సాంకేతిక సమస్యలన్నిం టినీ అధిగమించి సోమవారం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ షురూ అయింది. తొలిరోజు ఉదయం 10.30 గంటలకే 946 మంది రిజిస్ట్రేషన్ల కోసం ఫీజులు చెల్లించగా... 888 మంది స్లాట్‌బుక్‌ చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా శంషా బాద్‌ మండలంలో తొలి రిజిస్ట్రేషన్‌ పత్రాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ కొనుగోలుదారుకు అందించారు. మండలానికి చెందిన మంచాల ప్రభాకర్‌ తన భార్య ప్రశాంతి పేరుతో 4 గుంటల భూమిని గిఫ్ట్‌ డీడ్‌ రిజిస్ట్రేషన్‌ చేశారు. ఆయన భార్యకు డిజిటల్‌ సంతకంతో కూడిన రిజిస్ట్రేషన్‌ పత్రాలను సోమేశ్‌కుమార్‌ అందజేశారు. 

స్మార్ట్‌గా స్లాట్‌ బుకింగ్‌...
ధరణి పోర్టల్‌లో స్లాట్‌ బుకింగ్‌ ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేసింది. స్మార్ట్‌ ఫోన్‌ ఉన్న వారెవరైనా నేరుగా స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు. ఇది వరకు రిజిస్ట్రేషన్‌ కోసం డాక్యుమెంట్‌ రైటర్‌ను సంప్రదించి, కొంత నగదును కమిషన్‌ రూపంలో ఇస్తే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ త్వరితంగా అయ్యేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కొనుగోలు/అమ్మకందారుడెవరైనా నేరుగా స్మార్ట్‌ఫోన్‌ ద్వారా స్లాట్‌బుక్‌ చేసుకుని రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియలో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా కొనుగోలుదారు, అమ్మకందారులిరువురితోనే పూర్తయ్యేలా ప్రభుత్వం పక్కాగా ఏర్పాట్లు చేసింది. అలాగే మీసేవా కేంద్రాల్లో కూడా స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు. అక్కడ రూ.200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో హైదరాబాద్‌ జిల్లా మినహా 570 మండలాల్లో ధరణి సేవలు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు 1.48 ఎకరాలకు సంబంధించి 59.46 లక్షల ఖాతాలు ధరణిలో నిక్షిప్తం చేశారు. రిజిస్ట్రేషన్ల సమయంలో ఫింగర్‌ ప్రింట్‌ ఎంట్రీలో ఇబ్బందులు తలెత్తితే కంటి చూపు (ఐరిస్‌) ద్వారా వివరాలు అప్‌డేట్‌ చేసేలా వెసులుబాటు కల్పించారు. 

పారదర్శకంగా పోర్టల్‌: సోమేశ్‌కుమార్‌
ధరణి పోర్టల్‌ పారదర్శకంగా ఉంది. భూముల క్రయవిక్రయదారులు ఎవరిపై ఆధారపడకుండా స్వయంగా, స్వేచ్ఛగా ఈ పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. అన్ని మండల రెవెన్యూ కార్యాలయాల్లో స్లాట్‌ బుకింగ్‌ ఉన్న చోట తహసీల్దార్లు సోమవారం నుంచి రిజిస్ట్రేషన్‌లను ప్రారంభించారు. ఇలాంటి బృహత్తర కార్యక్రమం మొదలు పెట్టినప్పుడు చిన్నచిన్న సమస్యలు ఉంటాయి. సాంకేతిక నిపుణులు వాటిని వెంటనే పరిష్కరిస్తారు. రెండుమూడు రోజుల్లో సమస్యలను పూర్తిగా పరిష్కరించి రిజిస్ట్రేషన్లకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటాం. వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లపై త్వరలో ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారు.

మరిన్ని వార్తలు