బీఆర్‌ఎస్‌లో రచ్చకెక్కిన విభేదాలు

25 Dec, 2022 21:33 IST|Sakshi

ఎమ్మెల్యేల గరం గరం...అధిష్టానం మౌనం

అంతు చిక్కని గులాబీ బాస్‌ అంతరంగం

జిల్లా ద్వితీయ శ్రేణి నాయకులు, కేడర్‌లో గందరగోళం

సాక్షి, మేడ్చల్‌ జిల్లా: మంత్రి మల్లారెడ్డి వ్యవహారంపై అధిష్టానం నోరు మెదపకపోవడం మేడ్చల్‌ జిల్లాలో ఆసక్తిగా మారింది. సొంతపార్టీ ఎమ్మెల్యేలు ఆయనపై తిరుగుబాటు చేస్తూ బహిరంగంగా విమర్శనాస్త్రాలు సంధించినా అధిష్టానం దిద్దుబాటు చర్యలకు దిగకపోవడం చర్చనీయాంశంగా మారింది. కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తీరును తప్పుబడుతూ జిల్లా ఎమ్మెల్యేలంతా అసంతృప్తి గళం వినిపించారు. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే నేతృత్వంలో సమావేశమైన శాసనసభ్యులు మల్లారెడ్డిపై బహిరంగంగా.. జిల్లా అధ్యక్షుడు శంభీపూర్‌ రాజుపై పరోక్షంగా ఆరోపణలు గుప్పించారు. నామినేటెడ్‌ పదవుల ఖరారులో ఏకపక్ష వైఖరిని తప్పుబడుతూ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.

ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళతామని ప్రకటించారు కూడా.  ఇలా మంత్రి, ఎమ్మెల్యేల మధ్య అసమ్మతి వ్యవహారం రచ్చకెక్కి వారం రోజులవుతున్నా అధిష్టానం దిగిరాకపోవడం.. కనీసం అసమ్మతి ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాకపోవడం..  సర్దుబాటుకు చొరవ చూపకపోవడం పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. ఎన్నికలకు గడువు సమీపిస్తున్న తరుణంలో బడా నేతలే క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడినా గులాబీ బాస్‌ పట్టించుకోకపోవడమేమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మంత్రి మల్లారెడ్డి, బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు శంభీపూర్‌ రాజుతో కలిసి జిల్లా పార్టీలో గ్రూపులను ప్రోత్సహిస్తున్నారని ఎమ్మెల్యేలు ఆరోపించిన తీరుపై కూడా పార్టీ పెద్దలు మౌనం వహించటం వెనక అంతర్యమేమిటో ఆర్థం కావడంలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 
  
చాప కింద నీరులా విభేదాలు.. 
పార్టీలో చాప కింద నీరులా  కొనసాగుతున్న  విభేధాలు  మంత్రి మల్లారెడ్డిపై ఎమ్మెల్యేల తిరుగుబాటుతో బహిర్గతమైంది.అధినేత కేసీఆర్‌ ఇటీవల  సిట్టింగ్‌లందరికీ రాబోయే ఎన్నికల్లో  టికెట్లు ఇస్తామన్న ప్రకటనతో ఆశావహుల్లో అలజడి మొదలైంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో  సిట్టింగ్‌లే టికెట్‌ను ఖరారు చేసుకునే దిశగా అడుగులు వేస్తుండగా, ఆశావహులు వ్యూహా, ప్రతి వ్యూహాలతో  పార్టీ గాడ్‌ ఫాదర్ల ఆశీస్సులతో ప్రజల వద్దకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య అంతర్గతంగా ఉన్న గ్రూపులు బయట పడుతున్నట్లు పార్టీ వర్గాల్లో  చర్చ సాగుతోంది. ఈ ప్రభావం పార్టీ కేడర్‌తోసహా జిల్లా ప్రజల్లో పొడచూపటంతో  లుకలుకలు తారస్థాయికి చేరినట్లు  ప్రచార జరుగుతోంది.  

u కుత్బుల్లాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ మళ్లీ బరిలో నిలిచేందుకు అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకోవటం ద్వారా ప్రజల మద్దతును కూడగట్టుకొంటుండగా,.. ఇక్కడి నుంచి టికెట్‌ ఆశిస్తున్న బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ,ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు  శక్తియుక్తులను కూడగట్టుకుని గాడ్‌ ఫాదర్ల ఆశీస్సుల కోసం పావులు కదుపుతున్నట్లు  ప్రచారం జరుగుతోంది. దీంతో నియోజకవర్గలో ఇరువురి నేతల మధ్య పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు ,కేడర్‌ నలిగిపోతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  ఉప్పల్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి మళ్లీ పోటికి  ఏర్పాట్లు చేసుకుంటుండగా, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ టికెట్‌ దక్కించుకొవటమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. 

ఈ నేపధ్యంలోనే ఇరువురి మధ్య తరచుగా పార్టీ వేదికలు, పార్టీ కార్యక్రమాల్లో వివాదాలు తలెత్తుతున్నాయి. మేడ్చల్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే ,మంత్రి మల్లారెడ్డి ,మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి పోటా పోటీగా టికెట్‌ ఆశిస్తుండగా, మధ్యలో  మంత్రి తనయుడు మహేందర్‌రెడ్డి కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. మల్కాజిగిరిలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుతోపాటు ఆయన తనయుడు మైనంపల్లి రోహిత్‌ పోటికి సిద్దపడుతుండగా,  కూకట్‌పల్లి సీటుపై సిట్టింగ్‌ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో పాటు ఎమ్మెల్సీ నవీన్‌రావు కూడా నజర్‌ పెట్టినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

అలాగే, మల్కాజిగిరి ఎంపీగా పోటీచేసేందుకు రేసులో మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుతోసహా ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్‌ కూడా ఆసక్తి కనబరుస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. రాబోయే సాధారణ ఎన్నికల నేపథ్యంలో పార్టీలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేల పాటు కొత్తగా టికెట్లు ఆశిస్తున్న నేతల మధ్య నెలకొన్న విభేధాలు చాపకింద నీరులా బజారున పడినా అధిష్టానం నోరువిప్పక పోవటంపై పార్టీ వర్గాలతోపాటు రాజకీయ పార్టీలు, పరిశీలకులు పలు అభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. 

మరిన్ని వార్తలు