‘చచ్చింది కుక్కనే కదా...మనిషి కాదుగా’

30 Sep, 2020 13:48 IST|Sakshi

సాక్షి, హయత్‌నగర్‌: నిర్లక్ష్యంగా కారును డ్రైవ్‌ చేస్తూ పెంపుడు కుక్కపిల్లను చంపేసి దాని యజమానిపై, వారి కుటుంబ సభ్యులపైనా దాడిచేశారు. ‘చచ్చింది కుక్కేకదా...మనిషి కాదుకదా’ అంటూ పెంపుడు జంతువులపైన తనకున్న చులకన భావన, ద్వేషాన్ని ఓ వ్యక్తి వెల్లగక్కితే.. ఆ కుక్కపిల్ల ప్రాణం ఖరీదు రూ.250కి పోలీసులు పరిమితం చేసిన సంఘటన హయత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది.

బాధితుడి తెలిపిన వివరాలు ప్రకారం హయత్‌నగర్‌కు చెందిన శ్రీనివాసరావు కుటుంబం లాక్‌డౌన్‌ సమయంలో ఓ ల్యాబ్‌జాతి కుక్కపిల్లను పెంచుకుంటున్నారు. శనివారం సాయంత్రం మలవిసర్జనకు ఆ కుక్కపిల్లను బెల్టుతో పట్టుకుని ఇంటి ముందుకు రోడ్డు పక్కకు తీసుకురాగా ఆ మార్గంలో మితిమీరిన వేగంతో, నిర్లక్ష్యంగా పి.వెంకటేశం కారు (టీఎస్‌08 ఈఎస్‌ 7000) నడుపుతూ కుక్కపిల్లను గుద్దేశాడు. కుక్కను పట్టుకున్న యువతికి తృటిలో ప్రమాదం  తప్పింది. ప్రమాదం చేసి కారు ఆపకుండా వెళుతుంటే కాలనీకి చెందినవారు, కుక్క యజమాని అడ్డుకున్నారు. కారు ఆపారనే కోపంతో ఊగిపోతూ ‘చచ్చింది కుక్కనే కదా...మనిషి కాదుగా’ అంటూ గొడవకు దిగాడు. కుక్కను ఆసుపత్రికి తీసుకెళ్లమన్నందుకు  కుక్కపిల్ల యజమానిపై దాడి చేశారు.  (వావ్‌.. ఎంత క్యూట్‌గా ఉందో..!)

సంఘటనా స్థలంలో ఉన్న అదే కారులో కుక్క యజమాని పశువుల ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కారును గుంజుకు పోతావా అంటూ కుక్కపిల్ల యజమాని ఇంటిపై సుమారు 50మందిని నిందితుడు తీసుకొచ్చి ఇంట్లో ఉన్న వృద్ధురాలిని, యజమాని కుటుంబ సభ్యులను ఇష్టం వచ్చినకట్లు తిడుతూ ఇంటిపైకి దాడి చేశారు. యజమాని కొడుకును, అతని కుటుంబ సభ్యులను చంపుతామంటూ మొబైల్‌ వ్యాన్‌ పోలీసుల సమక్షంలోనే వీరంగం చేశారు. దాడిచేసిన వారిపై క్రిమినల్‌ కేసు పెట్టాలని, పెంపుడు జంతువులపై ద్వేషంతో కుక్కపిల్లను చంపిన వ్యక్తిని యానిమల్‌ యాక్ట్‌ ప్రకారం శిక్షంచాలని  కుక్కపిల్ల యజమాని శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గొడవ చేస్తూ ఇంటిపై  దొమ్మీ చేస్తుండగా ప్రత్యక్షంగా చూసిన పోలీసులు చట్ట పరిధిలోకి వచ్చే ఏ అంశాలను పట్టించుకోకుండా, సంఘటన జరిగిన సమయంలో  కేసును  పంచనామ చేయకుండానే ఐపీసీ సెక్షన్‌ 336 నమోదు చేసి నిందితులను కారుతో సహా పోలీసులు వదిలి వేశారు.  (వైరల్‌: ఆనందం పట్టలేక ఏడ్చేశాడు)

పోలీసులు నమోదు చేసిన సెక్షన్‌ ప్రకారం నిందితులకు మూడు నెలల జైలు లేదా 250 శిక్ష మాత్రమే. అంటే ఓ కుక్కపిల్లకు పోలీసులు రూ.250 ఖరీదు  కట్టారు. అల్లారు ముద్దుగా కుక్కపిల్లను పెంచుకుంటున్న ఆ కుటుంబం నిద్రాహారం లేకుండా ఏడుస్తున్నా చలించలేదు. నిందితుల నుంచి పొంచివున్న ప్రాణభయంతో ఆ కుటుం సభ్యులు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. మూగజీవిపై ద్వేషంతో కుక్కపిల్లను చంపిన వ్యక్తిపై యానిమల్‌ యాక్టు నమోదుచేయాలని, దాడిచేసిన వారిపై పలు సెక్షన్ల కింద క్రిమినల్‌ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని బాధితులు కోరుతున్నారు.  

మరిన్ని వార్తలు