ఆయనతో కాపురం చేయలేను.. విడాకులు కావాలి: టెకీ

15 May, 2021 09:59 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నానాటికీ మహిళలపై పెరుగుతున్న గృహహింస

భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైనా అదే పరిస్థితి

‘వర్క్‌ ఫ్రం హోమ్‌’తో చిన్నచిన్న విషయాలకే ఘర్షణ

పని ఒత్తిడి.. కోవిడ్‌ ఆవేదనే కారణం

పోలీస్‌ స్టేషన్లను ఆశ్రయిస్తున్న బాధితులు

అసలే లాక్‌డౌన్‌. మా ఆయన ఇంట్లో ఖాళీగా ఉంటున్నాడు. దీనికి తోడు నిత్యం మద్యం సేవిస్తున్నాడు. మత్తులో మరో మహిళతో గంటల తరబడి ఫోన్‌లో మాట్లాడుతున్నాడు, ఆమెతో వివాహేతర సంబంధం ఉందని తేలడంతో ప్రశ్నిస్తే అనుమానంతో రోజూ నరకం చూపిస్తున్నాడు... 
– ఓ బాధితురాలు ఇటీవల అర్బన్‌ మహిళా స్టేషన్‌లో అధికారికి వినిపించిన గోడు 

ఇద్దరం ఉద్యోగరీత్యా వేర్వేరు ప్రాంతాల్లో ఉండేవాళ్లం. గతంలో ఉద్యోగ ఒత్తిడి కారణంగా వారానికోసారి, నెలలో రెండు మూడు సార్లు కలిసే వాళ్లం. ప్రస్తుతం వర్క్‌ ఫ్రమ్‌ హోం కారణంగా ఇద్దరం ఒకే దగ్గర ఉంటున్నాం. ఏమైందో కానీ ఇప్పుడు ఆయన నా మాట వినడం లేదు. చిన్న విషయాలకే చిరాకు పడుతున్నాడు. అన్ని విషయాల్లో ఆయనదే పైచేయి కావాలని పట్టుబడుతున్నాడు. నేను ఆయనతో సమానంగా ఉద్యోగం చేస్తున్నా... సంపాదిస్తున్నా. అయినా నాపై పెత్తనం చేయడం నచ్చడం లేదు. అందువల్ల ఇకపై ఆయనతో కాపురం చేయలేను. నాకు విడాకులు ఇప్పించండి. 
– ఇటీవల ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి తన భర్తపై పోలీస్‌ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న విషయాలివి. 

నేను ఉద్యోగం చేస్తున్నా. ఈ క్రమంలో ఉద్యోగానికి సంబంధించి పలువురితో ప్రతీరోజూ ఫోన్‌లో మాట్లాడాల్సి ఉంటుంది. నేను మాట్లాడుతున్న మాటలను నా భర్త చాటుగా వినడంతో పాటు నేను స్నానానికి వెళ్లినప్పుడు నా ఫోన్‌లో మెసేజ్‌లు, కాల్‌లిస్ట్‌ చూస్తున్నాడు. ఇదంతా నాకు నచ్చలేదు. నాపై నమ్మకం లేని వ్యక్తితో కాపురం చేయడం ఎలా? దీంతో పాటు అదనపు కట్నం కోసం వేధింపులు ఇటీవల పెరిగాయి. ఆయనను భరించడం సాధ్యం కాదని తేలినందున నాకు విడాకులు ఇప్పించండి. – మహిళా పోలీసుస్టేషన్‌లో ఓ ప్రభుత్వ ఉద్యోగిని ఇచ్చిన ఫిర్యాదు సారాంశమిది.  

వరంగల్‌ క్రైం : కుటుంబం, భార్యాభర్తల మధ్య ఏర్పడే చిన్నచిన్న వివాదాలు ఏకంగా కాపురం కూలి పోయే స్థాయికి చేరుతున్నాయి. స్మార్ట్‌ ఫోన్లలో జరిగే వాట్సప్‌ చాటింగ్‌ వందల మంది జంటలు విడిపోవటానికి కారణహమవుతోంది. అనుమానం పెనుభూతమై భార్యలపై భౌతిక దాడుల వరకు వస్తోంది. మారుతున్న జీవన పరిస్థితుల వల్ల కుటుంబా ల్లో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. దంపతులి ద్దరూ ఉద్యోగం చేస్తున్న నేటి సమాజంలో ఇద్దరం సమానమే కదా అనే భావన పంతానికి దారి తీస్తోంది. ఫలితంగా అందమైన జీవితాలు రోడ్డు పాలు అవుతున్నాయి.

కరోనా తెచ్చిపెట్టిన చిచ్చు
కరోనా వైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌ విధించడం, ప లు కంపెనీలు, ప్రభుత్వ శాఖల్లో వర్క్‌ ఫ్రం హోంకు అవకాశమిచ్చారు. దీంతో ఉదయం ఆఫీస్‌కు వెళ్లి సాయంత్రం వచ్చే పలువురు ఎక్కువ సమయం ఇళ్లలోనే గడపాల్సి వస్తోంది. ఈ సమయాన్ని కొందరు దంపతులు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి యత్నిస్తున్నారు. కానీ మరికొందరు మాత్రం తప్పులు వెతుకుతూ డిటెక్టివ్‌ పాత్రలు పోషిస్తున్నారు. దీంతో గొడవలు మొదలై విడాకుల వరకు వస్తున్నాయి. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో మహిళలపై పెరుగుతున్న దాడుల నివారణ, సమస్యల పరిష్కారం, కౌన్సిలింగ్‌ కోసం ప్రత్యేకంగా రెండు మహిళా పోలీస్‌స్టేషన్లు ఏర్పాటుచేశారు. ఇటీవల ఈ పోలీస్‌ స్టేషన్లకు వస్తున్న ఫిర్యాదులను పరిశీలిస్తే అనేక కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. గత ఏడాది మొత్తం నమోదైన కేసులు.. ఈ ఏడాది నాలుగు నెలల్లోనే నమోదైన కేసులకు సమానంగా ఉండడం కరోనా తెచ్చిన మరో కష్టాన్ని చాటిచెబుతోంది.

అనుమానంతో పెరుగుతున్న కేసులు
భర్తకు భార్యపై కలిగే అనుమానం రోజురోజుకు కేసుల సంఖ్య పెరగడానికి కారణమవుతోందని అధికారిక నివేదికలు చెబుతున్నారు. చాలా ఫిర్యాదుల్లో కేవలం భార్యపై అనుమానం కారణంగా భర్త భౌతిక దాడులకు పాల్పడుతున్నట్లు చెబుతున్నారు. పోలీస్‌ అధికారుల విచారణలో కూడా ఈ విషయం వెల్లడవుతోంది. ఇక కొన్ని చోట్లయితే వర్క్‌ ఫ్రం హోంతో ఇంట్లో ఉండే భర్తలు తమకిష్టమైన ఆహా రం వండడం లేదని కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నట్లు తెలిసింది.

చాలా మంది మహిళలు ఇటీవల పోలీస్‌ స్టేషన్లలో ఇచ్చిన ఫిర్యాదుల్లో వంట గదికి సంబంధించినవి కూడా ఉండడం పోలీసు అధికారులనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీంతో పాటు ఇంతకాలం వరకట్నం కోసం అడపాదడపా వేధించే భర్తలు కరోనా మొదలయ్యాక దీనిని పనిగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మహిళా పోలీస్‌స్టేషన్లలో భర్త, కుటుంబ సభ్యులపై ఐపీసీ 498, 3/4 వరకట్న వేధింపుల చట్టం కేసులు నమోదవుతుండడం ఇందుకు తార్కాణంగా నిలుస్తోంది. కరోనా వేళ ప్రపంచం ఓపక్క భయాందోళనకు గురవుతున్న నేపథ్యంలో మహిళలపై గృహ హింస పెరుగుతుండడం ఆందోళన కలిగించే అంశమేనని పోలీసు అధికారులు చెబు తున్నారు.

మహిళా పోలీస్‌ స్టేషన్లలో నమోదైన కేసులు ఇలా...
సంవత్సరం   అర్బన్‌ మహిళా పోలీసు స్టేషన్‌  రూరల్‌ మహిళా పోలీసుస్టేషన్‌ 

2019              218                              120
2020             166                               15
2021               72                               18

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు