‘రక్షణ’లో అగ్రభాగాన నిలుపుతాం

20 May, 2022 01:57 IST|Sakshi

 డీఆర్‌డీఓ చైర్మన్‌ సతీశ్‌రెడ్డి

ఇబ్రహీంపట్నం రూరల్‌: రక్షణ ఉత్పత్తుల ఎగుమతుల్లో భారతదేశాన్ని అగ్రభాగాన నిలుపుతామని రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) చైర్మన్‌ జి.సతీశ్‌రెడ్డి తెలిపారు. మేకిన్‌ ఇండియా, మేక్‌ ఫర్‌ వరల్డ్‌ అనే సంకల్పాన్ని నెరవేరుస్తామని చెప్పారు. ఆదిభట్లలోని టాటా ఏరోస్పేస్‌ పార్కులో ఎస్‌కెఎం టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను సతీశ్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. రక్షణ రంగంలో ప్రైవేటు పరిశ్రమలకు అపార అవకాశాలు ఉన్నాయని.. ప్రైవేటు సంస్థలు ప్రభుత్వ పరీక్ష వ్యవస్థలను, సౌకర్యాలను వినియోగించుకోవచ్చని సతీశ్‌రెడ్డి చెప్పారు. భారత రక్షణ పరిశ్రమలను బలోపేతం చేయడం కోసం డీఆర్‌డీవో ఎలాం టి రాయల్టీ తీసుకోకుండానే వెయ్యికిపైగా పేటెంట్‌ ఉత్పత్తులను వినియోగించుకునే వీలు కల్పించిందని వివరించారు.

దేశీ సంస్థలకు మద్దతుగా అనేక రక్షణ దిగుమతులపై ప్రభుత్వం నిషేధం విధించిందని తెలిపారు. మన దేశానికి భారీగా రక్షణ ఎగుమతులు చేసే సామర్థ్యం ఉందని, రాబోయే రోజుల్లో కొత్త ప్రమాణాలను నెలకొల్పగలదని పేర్కొ న్నారు. రక్షణ పరికరాలకు సంబంధించి ప్రస్తు తం అతిపెద్ద దిగుమతిదారుల్లో ఒకటిగా ఉన్న మన దేశాన్ని అతిపెద్ద ఎగుమతిదారుల్లో ఒకటిగా మార్చేందుకు డీఆర్‌డీఓ ప్రయత్నిస్తోందని చెప్పారు. ఇప్పటికే బ్రహ్మోస్, ఆకాశ్‌ క్షిపణులు, ఏటీజీఎం, ఎస్‌ఏఎం, టార్పెడోలు, రాడార్‌లను ఎగుమతి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని వివరిం చారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ, మిధాని శాస్త్రవేత్తలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు