మంచిరెడ్డిపై ఈడీ ప్రశ్నల వర్షం 

28 Sep, 2022 04:02 IST|Sakshi

ఇండోనేసియాకు మనీలాండరింగ్‌ చేశారా? 

డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? 

ఎందుకోసం తరలించారు? 

9 గం. విచారణ..నేడూ కొనసాగింపు

సాక్షి, హైదరాబాద్‌: క్యాసినో కింగ్‌ చీకోటి ప్రవీణ్‌కుమా­ర్‌ వ్యవహారంలో మనీలాండరింగ్, ఫెమా నిబంధ­­­నలు ఉల్లంఘించినట్టు ఆరోపణలు ఎదుర్కొం­­టున్న ఇబ్రహీంపట్నం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణకు హాజరయ్యారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో బషీర్‌బాగ్‌లోని ఈడీ కా­ర్యా­లయానికి వచ్చిన మంచిరెడ్డిని అధికారులు రాత్రి వరకు ప్రశ్నించారు.

చీకోటితో ఏమిటి సంబంధం? మనీలాండరింగ్‌కు పాల్పడ్డారా? తరలించిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకోసం తర­లించాల్సి వచ్చింది? అన్న అంశాలపై స్టేట్మెంట్‌ రికార్డు చేసినట్టు తెలిసింది. చీకోటితో ఆయన కుటుంబసభ్యులకున్న ఆర్థిక లావాదేవీలపైనా ప్రశ్నించినట్టు సమాచారం. కాగా, మంచిరెడ్డిని 9 గంటల పాటు విచారించి ఇంటికి పంపించిన ఈడీ అధికారులు, బుధవారం కూడా విచారణకు హాజరు కావాలని సూచించారు.

ఫెమా నిబంధనలు ఉల్లంఘించి.. 
క్యాసినో వ్యవహారంలో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారంటూ చీకోటిని రెండు నెలల క్రితం ఈడీ ప్రశ్నించింది. ఆయనతో సంబంధాలున్నట్టుగా అనుమానాలున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను సైతం విచారించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా చీకోటితో 2015 నుంచి మంచిరెడ్డికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఈడీ గుర్తించింది. 2015–16లో ఇండోనేసియాలోని పెట్టు­బడులు పెట్టేందుకు చీకోటి నెట్‌వర్క్‌ ద్వారా మంచిరెడ్డి భారీగా డబ్బును హవాలా రూపంలో తర­లించినట్టు అనుమానిస్తోంది. ఇందులో ఫెమా నిబంధనల ఉల్లంఘన చోటు చేసుకున్నట్టు గుర్తించింది. ఈ నేపథ్యంలోనే కిషన్‌రెడ్డిని ఈడీ ప్రశ్నించినట్టు తెలిసింది.  

క్యాసినోల్లోనూ మంచిరెడ్డి పెట్టుబడులు 
క్యాసినోలోనూ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి లావాదేవీలున్నట్టుగా ఈడీ కీలక ఆధారాలు గుర్తించింది. ఇండోనేసియాలోని బాలి, నేపాల్, గోవాలో­ని క్యాసినోల్లో చీకోటితో పాటు మంచిరెడ్డి కొంతమేర పెట్టుబడి పెట్టినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. అదే సమయంలో కిషన్‌రెడ్డితో పాటు ఆయన కుటుంబీకుల్లో ఒకరికి చీకోటి ప్రవీణ్‌తో ఆర్థిక లావాదేవీలున్న విషయాన్ని దర్యా­ప్తు అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా మంచిరెడ్డిని ఈడీ అధికారులు విచారించినట్టు తెలిసింది. ఇలావుండగా మంచిరెడ్డి తర్వాత జాబితాలో ఎవరున్నారన్నదానిపై చర్చ జరుగుతోంది. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ మంత్రికి ఈడీ తాఖీదులు తప్పవని తెలుస్తోంది.   

మరిన్ని వార్తలు