జనసేనకు షాక్‌: ‘గాజుగ్లాసు’ పోయింది

17 Apr, 2021 03:28 IST|Sakshi

స్పష్టంచేసిన ఎస్‌ఈసీ

సాక్షి, హైదరాబాద్‌: రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు జరగనున్న ఎన్నికల పోటీలో జనసేన (గాజుగ్లాసు), ఎంసీపీఐ (యూ)-( గ్యాస్‌ సిలిండర్‌), ఇండియన్‌ ప్రజా పార్టీ (ఈల), ప్రజాబంధు పార్టీ (ట్రంపెట్‌), హిందుస్థాన్‌ జనతా పార్టీ (కొబ్బరి తోట) కామన్‌ గుర్తులను కోల్పోయాయి. గతేడాది జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మొత్తం స్థానాల్లో కనీసం 10 శాతం సీట్లకు పోటీచేయని నేపథ్యంలో ఈ పార్టీలు కామన్‌ గుర్తులను కోల్పోయినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్‌ తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కారణంగా ఓట్ల చీలిక నివారణకు పోటీ నుంచి ఉపసంహరించుకున్నట్లు ఎస్‌ఈసీకి పంపించిన లేఖలో జనసేన అధ్యక్షుడు పేర్కొన్నారు.

ఇప్పుడు జరగనున్న ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్లు, ఇతర మున్సిపాలిటీల్లో తాము పోటీచేయాలని నిర్ణయించడంతో తమ అభ్యర్థులకు ‘గాజుగ్లాసు’ కామన్‌ సింబల్‌ను కొనసాగించాలని ఎస్‌ఈసీని కోరారు. అయితే ఆయా అంశాలను తాము పరిశీలించామని, జనసేన సమర్పించిన వినతిపత్రంలోని అంశాలు సంతృప్తికరంగా లేకపోవడంతో ఈ విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నట్లు అశోక్‌కుమార్‌ స్పష్టం చేశారు. దీంతో 2025 నవంబర్‌ 18 వరకు జనసేన, ఇతర పార్టీలు కామన్‌ సింబల్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు కూడా అర్హత లేదని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు