ఇంటిపై కన్నేసి.. ఎన్నారైని చంపేసి!

4 Oct, 2023 11:50 IST|Sakshi

జీఆర్‌ కన్వెన్షన్‌ యజమాని రాజేష్‌ దురాగతం 

సహకరించిన డ్రైవర్‌తో పాటు ఇద్దరు బిహారీలు 

హతుడు అంజిరెడ్డి గతంలో సినీ నిర్మాత 

తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు 

ఎట్టకేలకు హత్యగా గుర్తించిన నార్త్‌జోన్‌ పోలీసులు 

అయిదుగురిని అదుపులోకి తీసుకున్న అధికారులు 

హైదరాబాద్: నగరంలో ఉన్న స్థిరాస్తుల క్రయవిక్రయం పేరుతో ఓ ఎన్నారైకి చేరువయ్యాడు. ఆయన ఇంటిపై కన్నేసి సొంతం చేసుకోవాలనుకున్నాడు.. దాన్ని ఖరీదు చేసేందుకు నగదు రూపంలో చెల్లింపులు చేసినట్లు డ్రాఫ్ట్‌ సిద్ధం చేసుకున్నాడు.. తన పథకాన్ని అమలు చేస్తూ అతడిని దారుణంగా చంపేశాడు.. గోపాలపురంలో ఉన్న సరోజినీదేవి రోడ్‌లోని జీఆర్‌ కన్వెన్షన్‌ యజమాని రాజేష్‌ వ్యవహారమిది. ఈ దారుణంలో పాలు పంచుకున్న అతడి భార్య, డ్రైవర్, ఇద్దరు బిహారీలతో పాటు రాజేష్‌ను  గోపాలపురం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. 

పౌరసత్వం రావడంతో విక్రయాలు... 
పద్మారావునగర్‌కు చెందిన జి.అంజిరెడ్డి (71) గతంలో సినీ నిర్మాతగా పనిచేశారు. ఈయనకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఓ కుమారుడు మోకిలాలో ఉంటుండగా.. మరో కుమారుడు, కుమార్తె విదేశాల్లో ఉంటున్నారు. ఇటీవలే అంజిరెడ్డితో పాటు ఆయన భార్యకు అమెరికా పౌరసత్వాలు వచ్చాయి. దీంతో అక్కడే స్థిరపడాలని భావించిన ఆయన నగరంలోని తన స్థిరాస్తులు విక్రయించాలని నిర్ణయించారు. అంజిరెడ్డి నిర్మాతగా ఉండగా సీనియర్‌ ఫొటోగ్రాఫర్‌గా పని చేసిన రవి కాట్రగడ్డతో ఇప్పటికీ స్నేహం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే అంజిరెడ్డి తన ఆస్తుల విక్రయం విషయం ఆయనకు ఎనిమిది నెలల క్రితం చెప్పి అమెరికా వెళ్లారు. రవి ఈ అంశాన్ని రియల్టర్లతో కూడిన వాట్సాప్‌ గ్రూపులో పోస్టు చేశారు. నెల రోజుల క్రితం భార్యతో తిరిగి వచి్చన అంజిరెడ్డి వద్దకు రవి తన వెంట జీఆర్‌ కన్వెన్షన్‌ యజమాని రాజే‹Ùను తీసుకువచ్చారు.  

ఇంటిపై మక్కువను గుర్తించి.. 
అంజిరెడ్డికి అలా పరిచయమైన రాజేష్‌ నమ్మకంగా, సన్నిహితంగా మెలిగాడు. పద్మారావునగర్‌లోని ఇల్లు తనకు నచి్చందని, తాను ఖరీదు చేస్తానని అంజిరెడ్డితో పాటు ఆయన భార్యతోనూ నమ్మబలికాడు. 1986లో కట్టిన ఆ ఇంటిపై భార్యాభర్తలకు ఉన్న మక్కువను గుర్తించిన రాజేష్‌.. వారిని బుట్టలో వేసుకునేలా మాట్లాడాడు. ఆ ఇంటిని పడగొట్టనని, మరింత అందంగా తీర్చుదిద్దుతానని తరచూ చెబుతుండేవాడు. సైదాబాద్‌లో ఉన్న మరో ఆస్తిని విక్రయించాలని అంజిరెడ్డి భావించారు. ఈ విషయం తెలుసుకున్న రాజేష్‌.. దాన్ని ఖరీదు చేయడానికి ఓ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పాడు.

తమ ఆస్తుల్ని విక్రయించిన ఇద్దరు మహిళలు ఇది ఖరీదు చేయడానికి అంగీకరించారంటూ అంజిరెడ్డితో చెప్పుకొచ్చాడు. వాస్తవానికి అంజిరెడ్డి, ఆయన భార్య గత నెల 22న ఆస్ట్రేలియా వెళ్లాల్సి ఉంది. అయితే 29న రెండు ఆస్తుల లావాదేవీలు పూర్తవుతాయని రాజేష్‌ వారితో చెప్పాడు. దీంతో భార్య వెళ్లగా.. అంజిరెడ్డి ఇక్కడే ఉండిపోయారు.  

పథకం ప్రకారం డ్రాఫ్ట్‌ సిద్ధం చేసి..   
ఎలాంటి నగదు చెల్లించకుండా అంజిరెడ్డికి పద్మారావునగర్‌లో ఇంటిని సొంతం చేసుకోవాలని రాజేష్‌ భావించాడు. దీనికోసం రెండు విడతల్లో ఆయనకు రూ.2.1 కోట్లు నగదు రూపంలో చెల్లించినట్లు, వయోవృద్ధుడు కావడంతో ఆయనకు ఏమైనా అయితే మరో రూ.50 లక్షలు ఆయన భార్యకు ఇచ్చి ఇంటిని రిజిస్ట్రేషన్‌ చేయించుకునేలా నమూనా డ్రాఫ్ట్‌ సిద్ధం చేశాడు. అంజిరెడ్డి మేడ్చల్‌లోని అద్వైత్‌ గేటెడ్‌ కమ్యూనిటీలో విల్లా ఖరీదు చేయాలని భావించారు. గత నెల 29 ఉదయం పద్మారావునగర్‌కు వెళ్లిన రాజే‹Ù... అంజిరెడ్డిని తీసుకుని మేడ్చల్‌ వెళ్లారు. అక్కడ ఉండగా ఆస్ట్రేలియా నుంచి ఫోన్‌ చేసిన భార్యతో అంజిరెడ్డి అదే విషయం చెప్పారు. ఆ తర్వాత మోకిలాలో ఉండే కుమారుడు శ్రీచరణ్‌రెడ్డి ఎన్నిసార్లు ప్రయతి్నంచినా అంజిరెడ్డి ఫోన్‌ కలవలేదు.  

అంతా కలిసి హత్య చేశారు.. 
అంజిరెడ్డి, రాజేష్‌ గత నెల 29 సాయంత్రం 5.30 గంటలకు వేర్వేరు కార్లలో జీఆర్‌ కన్వెన్షన్‌ ఉన్న డీమార్ట్‌ బిల్డింగ్‌లోకి ప్రవేశించారు. బేస్‌మెంట్‌– 3లో అంజిరెడ్డి కారు పార్క్‌ చేసిన తర్వాత రాజేష్, అతడి భార్య, డ్రైవర్, కన్వెన్షన్‌లో పని చేసే ఇద్దరు బిహారీలు అంజిరెడ్డిని దారుణంగా హత్య చేశారని పోలీసులు గుర్తించారు. ఆపై మృతదేహాన్ని బేస్‌మెంట్‌–3లోని ఆయన కారు వద్దకు తీసుకువచ్చి పడేశారని అనుమానిస్తున్నారు. ఆ రోజు రాత్రి 9.15 గంటలకు చరణ్‌కు ఫోన్‌ చేసిన రవి కాట్రగడ్డ అంజిరెడ్డికి యాక్సిడెంట్‌ అయిందని చెప్పారు.

హుటాహుటిన వచి్చన ఆయన బేస్‌మెంట్‌–3లో కారు పార్క్‌ చేసి ఉండటం, దాని పక్కనే అంజిరెడ్డి మృతదేహం పడి ఉండటాన్ని గుర్తించారు. గోపాలపురం పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజీలు, ఇతర సాంకేతిక ఆధారాలతో హత్యగా తేల్చారు. రాజేష్‌ సహా అయిదుగురినీ అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు