బావిలో పడిపోయి.. మృత్యువుతో పోరాడి

22 Feb, 2023 04:49 IST|Sakshi

మూడు గంటలపాటు వృద్ధురాలి పోరాటం 

రక్షించిన అగ్నిమాపక శాఖాధికారులు 

మానకొండూర్‌: మతిస్థిమితం లేక నడుస్తూ అదుపుతప్పి బావిలో పడిపోయిన ఒక వృద్ధురాలిని అగ్నిమాపక శాఖ సిబ్బంది రక్షించారు. కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ సంజీవ్‌నగర్‌ కాలనీలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. మండల కేంద్రానికి చెందిన ఉండింటి మధునమ్మ (80)కు ఇద్దరు కుమార్తెలు, కుమా­రుడు ఉన్నారు. కుటుంబ సభ్యులతో నివసిస్తున్న ఆమె.. మంగళవారం తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో నిద్రలేచింది.

అలాగే నడుస్తూ సమీపంలోని చేదబావిలో ప్రమాదవశాత్తు పడిపోయింది. బావిలోని బోర్‌మోటార్‌ పైపును పట్టుకొని అలాగే ఉండిపోయింది. ఉదయం 4.30 గంటల సమయంలో నిద్ర లేచిన ఓ మహిళకు బావిలోంచి వృద్ధురాలి అరుపులు వినిపించడంతో ఆమె సమీపంలోని వారికి చెప్పింది. వెంటనే స్థానికులు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించినా వీలుకాలేదు.

మధునమ్మ కుమారుడు రవి అందించిన సమాచారంతో మానకొండూర్‌ అగ్నిమాపక శాఖాధికారి భూదయ్య, లీడింగ్‌ ఫైర్‌మన్‌ ధర్మ్, ఫైర్‌మన్‌ పి.సంతోష్‌కుమార్‌ సంఘటన స్థలానికి చేరుకున్నారు. లీడింగ్‌ ఫైర్‌మన్‌ ధర్మ్‌ చేదబావిలోకి దిగి వృద్ధురాలిని ఉదయం 6.30 గంటల సమయంలో క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. సుమారు మూడు గంటలపాటు చేదబావిలో ఉన్న వృద్ధురాలు ప్రాణాలతో బయటపడటంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.  

మరిన్ని వార్తలు