సౌర వెలుగుల శిఖరంపై ముఖర.. రాష్ట్రంలోనే తొలి గ్రామంగా రికార్డు

3 Nov, 2022 02:59 IST|Sakshi

ఇచ్చోడ (బోథ్‌): ఆదిలాబాద్‌ జిల్లా ముఖర(కె) గ్రామ పంచాయతీ సొంత నిధులతో సౌర విద్యుత్‌ సౌకర్యం కల్పించుకుని రాష్ట్రంలోనే మొదటి గ్రామంగా నిలిచింది. పంచాయతీల్లో విద్యుద్దీపాలు, ఇతర సౌకర్యాల బిల్లులు పెరిగిపోతుండడంతో ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులున్నాయి. దీంతో సమస్య పరిష్కారానికి సర్పంచ్‌ గాడ్కే మీనాక్షి వినూత్నంగా ఆలోచించారు.

గ్రామంలో సేంద్రియ ఎరువుల విక్రయంతో వచ్చిన ఆదాయం రూ.4లక్షలు ఖర్చు చేసి సోలార్‌గ్రిడ్‌ ఏర్పాటు చేయించారు. దీనిద్వారా ఉత్పత్తి అయ్యే 6 కిలోవాట్ల విద్యుత్‌ను పంచాయతీ, అంగన్‌వాడీ, గ్రామ వీధి దీపాలకు వినియోగిస్తున్నారు. 4 కిలోవాట్ల విద్యుత్‌ పంచాయతీ అవసరాలకు సరిపోగా.. మిగతా 2కిలోవాట్ల విద్యుత్‌ను ట్రాన్స్‌కోకు విక్రయించి నెలకు రూ.4వేల ఆదాయం పొందుతున్నారు. బిల్లుల చెల్లింపు బాధ లేకపోగా ఆదాయం సమకూరుతుండటంతో ముఖర(కె) గ్రామ పంచాయతీ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచింది.
చదవండి: బడిలోనే ఒకరు.. బడికెళ్లనంటూ మరొకరు.. నలుగురు ఒకేరోజు..

మరిన్ని వార్తలు