వీధి శునకాల గణాంకాల పనుల్లో జీహెచ్‌ఎంసీ

27 Jul, 2020 07:37 IST|Sakshi

5 వార్డుల్లో స్పెషల్‌ డ్రైవ్‌ .. 

ఆ తర్వాత అన్ని వార్డుల్లో.. 

నియంత్రించే దిశగా చర్యలు  

ఇప్పటి వరకు 3,147 కుక్కలకు ఆపరేషన్లు 

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో వీధి కుక్కల బెడద అంతాఇంతా కాదు. వీటి దాడుల్లో తరచూ ఎంతోమందికి గాయాలవుతూనే ఉన్నాయి. అడపాదడపా మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ముఖ్యంగా కుక్కల దాడుల్లో మరణిస్తున్న వారిలో చిన్నపిల్లలే ఉండటం విషాదకరం. కుక్కల సంఖ్య పెరగకుండా ఉండాలంటే వాటికి సంతాన నిరోధక శస్త్రకిత్సలు (స్టెరిలైజేషన్స్‌) చేయడం ఒక్కటే మార్గం. కుక్క కరిచినా దాని ద్వారా వచ్చే రేబిస్‌ వ్యాధి రాకుండా ఉండాలంటే వీధి కుక్కలన్నింటికీ వ్యాధి నిరోధక వ్యాక్సిన్‌ (టీకా) వేయాలి. ఇంతకుమించి వేరే మార్గాల్లేవు. కుక్కలను సంహరించేందుకు జంతు సంరక్షణ చట్టాలు ఒప్పుకోవు. అంతేకాదు.. ప్రజల నుంచి ఫిర్యాదులు అందినప్పుడు జీహెచ్‌ఎంసీలోనిసంబంధిత వెటర్నరీ సిబ్బంది కుక్కలను పట్టుకొని వాటికి వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్‌లు చేసి తిరిగి ఎక్కడ పట్టుకున్నారో.. అక్కడే వదిలిపెడతారు.

దీంతో ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. కాగా.. నగరంలో కచ్చితంగా ఎన్ని వీధికుక్కలు ఉన్నాయో సరైన లెక్కల్లేవు. కుక్కలు ఎనిమిది నెలల  వయసులోనే సంతానోత్పత్తి శక్తి కలిగి ఉండటం,  ఒక కుక్క ఏడాదికి రెండు పర్యాయాలు సంతానోత్పత్తి చేసే అవకాశం ఉండటంతో  వీటి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఒక కుక్క, దాని సంతతి ద్వారా ఏడాదికాలంలో 40కిపైగా కుక్కలు నగర వీధుల్లోకి చేరుతున్నాయి. వెటర్నరీ విభాగం శునకాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంటున్నప్పటికీ, ప్రజలకు కుక్క కాట్లు తప్పడం లేవు. ఈ నేపథ్యంలో గ్రేటర్‌ నగరంలో ఉన్న మొత్తం వీధి కుక్కలెన్నో  తెలుసుకునేందుకు జీహెచ్‌ఎంసీ వెటర్నరీ విభాగం సిద్ధమైంది.

గుర్తించే ప్రతి కుక్కకూ టీకా వేయడం, దానికి అప్పటి వరకు   సంతాన నిరోధక శస్త్ర చికిత్స జరిగి ఉండకపోతే శస్త్ర చికిత్స చేయాలనేది లక్ష్యం. గ్రేటర్‌ మొత్తం ఒకే పర్యాయం కాకుండా పైలట్‌ ప్రాజెక్టుగా తొలుత  ఐదు వార్డుల్లో ఈ పనులకు నెల క్రితం శ్రీకారం చుట్టారు. ఆగస్ట్‌ 15 వరకు ఈ సర్వే పూర్తి చేయాలనుకున్నప్పటికీ.. వెటర్నరీ సిబ్బందిలో కూడా కొందరికి కరోనా సోకడం తదితర పరిణామాలతో ఆగస్ట్‌ నెలాఖరు వరకు పూర్తవుతుందని భావిస్తున్నారు. పాతబస్తీలోని శాలిబండతోపాటు ఆసిఫ్‌నగర్‌ వార్డుల్లో సర్వే నెమ్మదిగా జరుగుతోంది. ఆ ప్రాంతాల్లో పనిచేసే సిబ్బందిలో ఎక్కువ మందికి కరోనా సోకడంతో కొందరు మాత్రమే సర్వేలో పాల్గొంటున్నట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు