‘గ్రేటర్‌’ ఎన్నికల్లో 10 శాతం సీట్లు ఇవ్వండి

17 Nov, 2020 20:58 IST|Sakshi

నాయీ బ్రాహ్మణుల డిమాండ్‌

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గురప్ప

సాక్షి, హైదరాబాద్‌: పాలకులు తమను పట్టించుకోవడం లేదని నాయీ బ్రాహ్మణులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల చట్టసభల్లో ప్రాతినిథ్యం లేకపోవడంతో తమ గళం వినిపించే అవకాశం లేకుండాపోయిందని వాపోయారు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభ్రదుల నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మల్లుగాల్ల గురప్ప ఆధ్వర్యంలో మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నాయీ బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. సామాజికంగా, ఆర్థికంగా వెనుబడిన నాయీ బ్రాహ్మణులు ఆత్మగౌరవం రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గురప్పను గెలిపించుకోవాలని బహుజనులకు పిలుపునిచ్చారు.

తెలంగాణ ప్రభుత్వం నాయీ బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. లాక్‌డౌన్‌లో క్షౌరశాలలు మూతపడటంతో వృత్తిదారులు చాలా కష్టాలు పడ్డారని, ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదని తెలిపారు. తెలంగాణ సర్కారు వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని కోరారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నాయీ బ్రాహ్మణులకు 10 శాతం సీట్లు కేటాయించాలని అన్ని రాజకీయ పార్టీలను డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు దేవరకొండ నాగరాజు, ప్రధాన కార్యదర్శ ఎం. సుబ్బారాయుడు, సీఎల్‌ఎన్‌ గాంధీ, రామానంద స్వామి, సీనియర్‌ కార్టూనిస్ట్‌ నారూ, డాక్టర్‌ రాపోలు సుదర్శన్‌, బాలరాజు, ఎం రమేశ్‌, ఎ. సుధాకర్‌, ధన్‌రాజ్‌, కె. యాదగిరి, కె. ఈశ్వర్‌, జె. మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు. (జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల)

మరిన్ని వార్తలు