ఏడేళ్లుగా తల్లిడిల్లిన తల్లి హృదయం.. అన్ని ఆధారాలతో బిడ్డ చెంతకు.. భర్త కూడా!

29 May, 2023 17:54 IST|Sakshi

బిడ్డలను చూడకుండా తల్లి ఒక్కక్షణం కూడా ఉండదు. కంటికి రెప్పలాగా కాపాడుకుంటుంది. తప్పనిస్థితిలో బిడ్డలకు దూరంగా ఉంచాల్సి వచ్చినా.. తల్లి హృదయం వారిమీదే ఉంటుంది. బిడ్డ కనిపించకపోతే ఇక తల్లి హృదయం పడే  వేదన అంతా ఇంతా కాదు! అలాంటిది ఒకటి రెండు రోజులు కాదు.. ఏకంగా ఏడేళ్లుగా అనుభవిస్తున్న ఓ తల్లి బాధ నేటికి సుఖాంతమైంది.

డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా (తూర్పు గోదావరి జిల్లా) సఖినేటి పల్లి మండలం అంతర్వేదిలో 2016లో తండ్రితో పాటు వెళ్లినప్పుడు అక్ష అనే చిన్నారి తప్పిపోయింది. ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది. దీంతో పాప తల్లి ద్వారక అప్పట్లోనే సఖినేటిపల్లి పీఎస్ లో ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి పాపకోసం  తల్లి ద్వారక వెతుకుతోంది.

అయితే.. కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండలంలో భాగ్యలక్ష్మి అనే మహిళ దగ్గర ఇటీవల పాపను అనుమానస్పదంగా గుర్తించి పోలీసులకు అప్పగించారు స్థానికులు. చిన్నారిని కరీంనగర్ లోని బాల రక్షా భవన్ కు పోలీసులు అప్పగించారు.

పాప ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చూసి తమ బిడ్డే అంటూ ఇటీవల వేరువేరు ప్రాంతాల నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారిలో పద్మ అనే మహిళ.. ఆ పాప తన మనవరాలేనంటూ ఆధారాలు చూపించింది. విచారణ చేపట్టిన శిశు సంక్షేమ శాఖ అధికారులు నిజానిజాలు తేల్చారు. పద్మ చెప్పింది నిజమేనని నిరూపించుకున్న తర్వాత పాప తల్లి ద్వారకను అధికారులు పిలిపించారు.

చిన్నారిని చూసిన తల్లి బోరున విలపించింది. తనతో గొడవపడి భర్త రవి పాపని తీసుకొని వెళ్లిపోయాడని ద్వారక చెప్పింది. పాప కోసం రవి కూడా రావడంతో పాప సమక్షంలోనే ఏడేళ్ల తర్వాత భార్యాభర్తలు కలిసిపోయారు. అన్ని ఆధారాలు  ధ్రువీకరించుకున్న తర్వాత అధికారులు పాపను తల్లిదండ్రులకు  అప్పగించారు.
Delhi Shahbad Dairy Case:: గాళ్‌ఫ్రెండ్‌తో గొడవ.. అందరూ చూస్తుండగానే..!

మరిన్ని వార్తలు