గోల్కొండ, కుతుబ్‌షాహీ పరిరక్షణలో నిర్లక్ష్యమా?

31 Mar, 2021 08:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ప్రతిష్టాత్మక చారిత్రక కట్టడాలు గోల్కొండ కోట, కుతుబ్‌షాహీ టూంబ్స్‌ పరిరక్షణలో ఆర్కియాలజీ, పర్యాటకశాఖలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. రాత్రయితే ఒక్కలైటు ఉండడం లేదని, పర్యాటకుల టికెట్ల ద్వారా వచ్చిన డబ్బుతో ఏం చేస్తున్నారని నిలదీసింది. చారిత్రక కట్టడాల నిర్వహణ, పరిరక్షణకు ఎటువంటి ప్రణాళికలు రూపొందించారో తెలియజేయాలని, అలాగే బడ్జెట్‌ కేటాయింపులు తదితర వివరాలు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణకు కేంద్ర ఆర్కియాలజీ విభాగం డైరెక్టర్‌ జనరల్, రాష్ట్ర పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మా సనం మంగళవారం ఆదేశించింది. గోల్కొండ కోట, కుతుబ్‌షాహీ టూంబ్స్‌ పరిరక్షణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, దీంతో ఈ రెండు చారిత్రక కట్టడాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయంటూ పత్రికల్లో వచ్చిన కథనాలను ధర్మాసనం సుమోటోగా విచారణకు స్వీకరించింది. ‘ఈ రెండు చారిత్రక కట్టడాల పరిరక్షణలో అధికారులు నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు.

రాత్రయితే ఒక్కలైటూ కనిపించడం లేదు. మట్టిగోడలు కూలిపోతున్నాయి’అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈనెల 7న కేంద్ర ఆర్కియాలజీ విభాగం డైరెక్టర్‌ జనరల్, రాష్ట్ర పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది.

గో మహాగర్జనకు హైకోర్టు అనుమతి
కవాడిగూడ: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం లో ఏప్రిల్‌ 1న జరగనున్న గో మహాగర్జనకు హై కోర్టు అనుమతిచ్చిందని యుగ తులసి ఫౌండేషన్‌ చైర్మన్, టీటీడీ పాలక మండలి సభ్యుడు కొలిశెట్టి శివకుమార్‌ తెలిపారు. మంగళవారం ఆయన ఎన్టీఆర్‌ స్టేడియంలో విలేకరులతో మాట్లాడుతూ.. గో హత్యలు నిషేధించాలని, కబేళాలు మూసివేయాలని, గోవులను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ తాము పిలుపునిచ్చిన గో మహాగర్జనకు ప్రభు త్వం అడ్డుపడిందన్నారు. ఈ గర్జనలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా ప్రకటనలు వస్తాయన్న ఉద్దేశంతో అనుమతి నిరాకరించిందన్నారు. వెంటనే తాము హైకోర్టును ఆశ్రయించగా అనుమతి వచ్చిందన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు