సత్తా చాటిన గురుకుల విద్యార్థులు

9 Feb, 2022 03:44 IST|Sakshi
గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల భవనం

‘నీట్‌’లో గౌలిదొడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థుల ప్రతిభ 

మొదటిరౌండ్‌లో 161 మందికి ఎంబీబీఎస్‌ సీట్లు 

రాయదుర్గం: పేదింటి విద్యార్థులు ఇంజినీర్లు...డాక్టర్లు  కాబోతున్నారు. ఇంటర్మీడియేట్‌ విద్యతోపాటు ఐఐటీ, నీట్, ఎంసెట్‌ ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో విద్యార్థులు ఆయా పోటీ పరీక్షల్లో సత్తా చాటుతున్నారు. గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ బాలుర ఐఐటీ, జేఈఈ నీట్, ప్రెప్‌ అకాడమీ విద్యాలయం తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటోంది. ఉపాధ్యాయుల సమష్టి కృషి, విద్యార్థుల కష్టపడే తత్వం, క్రమ శిక్షణ, పోటీ పడి చదవాలనే తపనతో వారు ఇంటర్మీడియట్‌తోపాటు ఉన్నత విద్య కోసం రాసే పరీక్షల్లో సీట్లు సాధిస్తున్నారు. 

పక్కాగా టైం టేబుల్‌.. 
ఇక్కడ చదువుతున్న విద్యార్థులందరూ రైతు కూలీ లు, కూరగాయల విక్రయదారులు, రైతులు, ఇతర సామాన్య, పేద వర్గాలకు చెందిన వారి పిల్లలే కావ డం గమనార్హం. రోజూ తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు టైంటేబుల్‌ ఆధారంగా చదువుకోవడం, ఏవైనా డౌట్లు ఉంటే ఉపాధ్యాయులతో మాట్లాడి వాటిని నివృత్తి చేసుకోవడం జరుగుతోంది. దీంతోపాటు ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తూ విద్యార్థుల ప్రతిభను అంచనా వేయడమేగాక, వారు ఏఏ అంశాల్లో  వెనుకబడ్డారో గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. 

161 మందికి ఎంబీబీఎస్‌ సీట్లు   
♦ గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలబాలికల కళాశాలల్లో కలిసి 161 సీట్లు సాధించారు. 

♦ ఈ ఏడాది ఇప్పటి వరకు నిర్వహించిన మొదటి రౌండ్లోనే 161 మందికి ఎంబీబీఎస్‌ సీట్లు వచ్చాయి. 

♦ కాగా మరో 29 మంది విద్యార్థులు మొదటిసారిగా ఇంటర్మీడియెట్  చదువుతూ నీట్‌ కోచింగ్‌ పొంది ఎంబీబీఎస్‌ సీట్లు పొందడం విశేషం. 

♦ బీబీనగర్‌లోని ఎయిమ్స్‌లో మొదటిసారిగా మురళీమనోహర్‌ అనే విద్యార్థి ఎంబీబీఎస్‌ సీటు పొందారు. 

♦ బి.ప్రవీణ్‌కుమార్‌ కేఎంసీ వరంగల్‌లో ఎంబీబీఎస్‌ సీటు సాధించాడు 

♦ స్పందన, కావ్య, శామ్యూల్, వేణుమాధవ్‌తోపాటు 18 మందికి ఉస్మానియా మెడికల్‌ కళాశాలలో సీట్లు దక్కాయి. 

♦ ఏడుగురు విద్యార్థులకు గాంధీ మెడికల్‌ కళాశాలలో కూడా సీట్లు పొందడం విశేషం. 

♦ 120 మందికి ఐఐటీ, ఎన్‌ఐటీ కోసం శిక్షణ ఇవ్వగా 87 మందికి ఐఐటీ, ఎన్‌ఐటీలలో సీట్లు సాధించడం విశేషం. 

మరిన్ని వార్తలు